బీఆర్ఎస్ పదేండ్లు ప్రాజెక్టులను గాలికొదిలేసింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీఆర్ఎస్ పదేండ్లు ప్రాజెక్టులను గాలికొదిలేసింది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •  వారిది అధికార అహంకారం.. 
  • మాది మానవీయ పరిపాలన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నల్గొండ, వెలుగు : గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికార అహంకారంతో ప్రజలను హింసిస్తూ, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛలైన ఎస్ఎల్బీసీ, డిండి, నక్కలగండి వంటి కీలక ప్రాజెక్టులను దశాబ్ద కాలం పాటు గాలికొదిలేసిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ఆదివారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలో హ్యామ్ మోడల్ రోడ్ల శంకుస్థాపన పైలాన్‌ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తమ ప్రజా ప్రభుత్వం ప్రజల కష్టాలను గుర్తించిందని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించారని తెలిపారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల వివిధ పథకాల ద్వారా మొత్తంగా దాదాపు రూ. 90,000 కోట్లతో రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను పెద్దఎత్తున అభివృద్ధి చేసి తెలంగాణ భవిష్యత్తుకు పునాది వేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మానవీయ కోణంలో పరిపాలిస్తోందని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ఏటా రూ. 20 వేల కోట్లు, రాబోయే ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా వడ్డీలేని రుణాలు ఇప్పించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. సొంతింటి కల నెరవేర్చుకోలేక ఇబ్బంది పడుతున్న ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం రూ. 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఇందుకోసం రూ. 22,500 కోట్లు కేటాయించి 4.50 లక్షల ఇండ్ల నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. కోటీ 6 లక్షల రేషన్ కార్డుదారులకు 6 కేజీల చొప్పున నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ, 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. 

ఎస్ఎల్బీసీని పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించబోతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా కరువు తీర్చడమే లక్ష్యంగా సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్, డిండి ప్రాజెక్టులను ఆధునీకరిస్తామని, బస్వాపురం, గండమల్ల, పునాదిగాని కాలువ పనులతో పాటు పెండింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందిస్తామన్నారు.

దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో 152 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతులకు రూ. 39 వేల కోట్లు చెల్లించామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే రైతులకు మొత్తం రూ. 79,886 కోట్లు చెల్లించి దేశంలోనే అగ్రగామిగా నిలిచామని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో గతంలో 3 లక్షల టన్నులు కొంటే.. ఈ ఒక్క యాసంగిలోనే 7.66 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశామని, రైతులకు ఇచ్చే నగదును రూ. 677 కోట్ల నుంచి రూ. 10,827 కోట్లకు పెంచామన్నారు. 

భూసేకరణ సమస్యలను పరిష్కరించాలి : ఎంపీ రఘువీర్ రెడ్డి 

నాగార్జునసాగర్ నియోజకవర్గంలో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ లింకు కెనాల్స్ పూర్తి చేయాలని, ఎస్ఎల్బీసీ, డిండి ప్రాజెక్టు పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ రఘువీర్​రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీలు శంకర్ నాయక్, నెల్లికంటి సత్యం, కోటిరెడ్డి, డైరీ డెవలప్మెంట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, నల్గొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు బాలు నాయక్, బత్తుల లక్ష్మారెడ్డి, కుందూరు జైవీర్ రెడ్డి, మందుల సామేలు, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డి, మాజీ శాసన మండలి ఛైర్మన్ నేతి విద్యాసాగర్, మల్ రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ముందస్తు అరెస్టులు.. 

 సీఎం పర్యటనను అడ్డుకుంటారనే సమాచారంతో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ(ఎం) నేతలను పోలీసులు తెల్లవారుజాము నుంచే హౌస్ అరెస్టులు చేసి స్టేషన్లకు తరలించారు. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించిన మాల మహానాడు నేతలను తెల్లవారుజామునే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సభా వేదిక వద్ద ప్లకార్డులతో నిరసన తెలిపేందుకు ప్రయత్నించిన టీ-ఆర్ఎస్ మహిళా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు  ప్రభుత్వ ప్రకటనల్లో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి  ఫొటో లేకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు.