కలము పట్టాను కరమున కళ్లు తెరచి
పార జూచాను లోకాన్ని పట్టుబట్టి
ప్రజల భావాలే కవితలుగా పల్లవించు
వసుధ వినిపించు నామాట వాక్కులమ్మ
లోక కవి డా. అందెశ్రీ అక్షర కిరణాలు ప్రభవ గీతాలై.. ప్రబోధాలై మన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. చిన్న వయసులోనే అమ్మానాన్నల ఆప్యాయతకు శాశ్వతంగా దూరమైన అందె ఎల్లయ్య.. పశువుల కాపరిగా, తాపీమేస్త్రిగా బతుకు యుద్ధం చేస్తూ.. జనజీవన జానపదాలకు జవసత్వం నింపుతూ.. తెలంగాణ రాష్ట్ర గీతం ‘‘జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం..” విరచించే స్థాయికి ఎదిగిన అందెశ్రీ జీవితం.. నేటి తరానికి స్ఫూర్తిదాయకం. భవిష్యత్ తరాలకు మార్గదర్శనం. అలాంటి వ్యక్తి అస్తమించినప్పుడు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు అందెశ్రీ అంత్యక్రియల్లో పాడె మోయడం ప్రపంచమంతా చూసింది.
ప్రముఖ కవి, రచయిత డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ సంపాదకత్వంలో.. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవిగా, వాగ్గేయకారునిగా అద్వితీయమైన పాత్ర నిర్వహించి ‘తెలంగాణ ధూంధాం’ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొన్న అందెశ్రీకి అక్షరాంజలిగా వెలువడిన పుస్తకమే ‘జనగీతిక’. ఈ పుస్తకంలో 67 మంది కవులు అందెశ్రీని సంస్మరిస్తూ అక్షర నివాళి అర్పించారు. కదిలించే పాట, పదునైన మాట లోకంలో ఉన్నంతకాలం ఆయన కీర్తి శిఖరాయమానమై నిలుస్తుందన్న ఆకాంక్షను తమ కవితలలో కవులు వ్యక్తపరిచారు. డా. వెనిగళ్ల రాంబాబు, డా. ఏనుగు నరసింహారెడ్డి, అన్నవరం దేవేందర్, కందాళై రాఘవాచార్య, దాస్యం సేనాధిపతి, అంజనా శ్రీ, జ్యోతి, ఆరుట్ల మాధవి, మౌనశ్రీ మల్లిక్, తోకల రాజేశం, నామాల రవీంద్ర సూరి వంటి వారి కవితలు ఉన్నాయి.
నింగిలో తారకలు నిలిచేంతవరకు
అందెశ్రీ నీ పేరు అజరామరం..
*
అందెశ్రీ ఒక వ్యక్తి కాదు
తెలంగాణ మట్టిలో నాటిన శాశ్వత స్వరం..
*
అందెశ్రీ పాటల పూదోట
తరతరాల స్ఫూర్తి తోవలో
కవన భవన ప్రేరణ బాట..
వంటి వాక్య కిరణాలు పుస్తకం నిండా ఎన్నో ఉన్నాయి. కవితలన్నీ చదువుతుంటే అందెశ్రీ కోసం అక్షరాలన్నీ పోటీపడినట్లుగా ఉన్నాయి. అలంకారాలన్నీ అభ్యుదయమై గానాలాపన చేస్తున్నాయి.
కవులంతా తమ హృదయాలను కాగితాలుగా చేసుకుని ‘లోక కవి’ పై ప్రేమను అక్షరాలుగా మార్చారు. మాయమైపోతున్న మనిషి తత్వాన్ని నదీ గానం చేస్తూనే మరో నిప్పుల వాగును సృష్టించారు.
తెలంగాణ కవితేజం, శిఖరానికి అంజలి, అందెశ్రీకి అభివందనం, పాట నిద్ర వోయింది. కవి లేడిప్పుడు, నేలకొరిగిన సాహితీ శిఖరం, రాజు మోసిన ఆకాశం, మాయమవ్వని మనిషి వంటి విభిన్న శీర్షికలతో సాగిన కవనాల పయనం పాఠకులకు ఓ మంచి అనుభూతిని మిగులుస్తుంది. మనిషెత్తు సాహిత్యం ప్రవహించే పరిమళం అణువణువునా ఆత్మగౌరపు గంభీర కంఠనాదం బలంగానే వినిపించింది.
అందెశ్రీపై.. ఆయన అక్షరాలపై.. గౌరవాభిమానాలు కలిగిన డాక్టర్ తిరునగరి శ్రీనివాస్ ఈ పుస్తకాన్ని ప్రజాక్షేత్రంలోకి తీసుకురావడంలో చేసిన కృషిని అందరం అభినందించాల్సిందే. గతంలో కూడా శ్రీనివాస్ సంపాదకత్వంలో కవనభేరి, పాటల సిరి, వెన్నెల పాట, పాటల తోటమాలి, జ్ఞాన వీచిక, కవితా విశ్వంభరుడు వంటి పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సిరి వెన్నెల సీతారామశాస్త్రి, ఎస్పీ బాలసుబ్రమణ్యం, వెన్నెల కంటి, సి. నారాయణ రెడ్డి వంటి దిగ్గజాలకు అక్షర నివాళులర్పించారు.
అందెశ్రీ కవి మిత్రమా!
అందెలతో అక్షరాల అగ్నిజ్వాలల్
చిందించిన చైతన్యమ! అందుకొ!
మనతెలుగుజాతి అభినందనముల్!!
అంటూ ప్రముఖ సినీగేయ రచయిత డాక్టర్ వెనిగళ్ల రాంబాబు పద్య రూపంలో అందించిన నివాళి స్ఫూర్తి సాక్షిగా అందెశ్రీ అక్షర కీర్తి సామ్రాజ్యం.. శాశ్వతం.
బతుకు పాఠశాలలోనే.. జీవన సత్యాలతో కూడిన పాఠాలను నేర్చుకుని తనదైన శైలితో తెలుగు సాహిత్యంలో తెలంగాణ పాటలతో అజరామరమైన ఖ్యాతిని ఆర్జించారు అందెశ్రీ. ఆయన సాహితీ లోకానికి, తెలంగాణ ప్రజలకు చేసిన సామాజిక కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం దేశ పౌర పురస్కారం పద్మశ్రీని అందెశ్రీకి ఇవ్వడం సముచితం.
- ఫిజిక్స్ అరుణ్ కుమార్
