నల్లగొండ జిల్లా సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యంగా... కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా... ఎన్జీ కాలేజ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎస్ఎల్బీసీ (SLBC), డిండి, నక్కల గండి ప్రాజెక్టులు నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష అని గుర్తు చేసిన ఆయన... గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం తన అహంకారంతోనే ఈ ప్రాజెక్టులను పక్కనబెట్టి, జిల్లా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎంత బడ్జెట్ అయినా సరే కేటాయించి... ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి తీరుతుందన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తున్నామని... హ్యామ్ (HAM) మోడ్ ద్వారా ఏకంగా రూ. 13 వేల కోట్లతో రోడ్లను అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కేవలం రోడ్లే కాదు... రాష్ట్రంలోని మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని కోటీశ్వరులను చేయాలన్నదే ఇందిరమ్మ రాజ్యం ధ్యేయమన్నారు. ఇందులో భాగంగానే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని... రాబోయే ఐదేళ్లలో ఏకంగా ఒక లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను మహిళలకు అందించి తీరుతామని సంచలన ప్రకటన చేశారు.
►ALSO READ | నిన్నTRS..ఇవాళ BRS..రేపు HRS హరీశ్ రాష్ట్ర సమితి : మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
ఇక ఇండ్లు లేని నిరుపేదల సొంతింటి కల నిజం చేసేందుకు రూ. 22,500 కోట్ల భారీ నిధులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఎన్నో ఏళ్లుగా నల్లగొండ, ఖమ్మం జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి కంటికి రెప్పలా అండగా నిలిచాయని... ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ ప్రాంతాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.
