- పీవీ జ్ఞాన భూమిలో నివాళులు అర్పించిన మంత్రులు, కుటుంబ సభ్యులు
- ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ, కాంగ్రెస్ చీఫ్ ఖర్గే నివాళులు
హైదరాబాద్/న్యూఢిల్లీ, వెలుగు: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 105వ జయంతి సందర్భంగా ఆయనకు ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ పీవీ జ్క్షాన భూమిలో ఆయన సమాధికి కుమార్తె ఎమ్మెల్సీ వాణీ దేవి, కుమారుడు ప్రభాకర్ రావు, మనువడు ఎన్‌వీ సుభాష్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ , ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌తో పాటు పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన ఘనత పీవీకి దక్కుతుందని కొనియాడారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. దేశ ఆర్థిక సంస్కరణలకు నాంది పలికిన దూరదృష్టి కలిగిన మహానేత పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయమని అన్నారు. పీవీ కేవలం తెలంగాణకే కాదు.. యావత్ దేశానికి మార్గదర్శకులు అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
నేడు ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదగడానికి ఆయన వేసిన పునాదులు కీలకమన్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్ రావు మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక పీవీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించిందన్నారు. సంజయ్ గాంధీకి స్మృతి వనం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం పీవీకి అలా చేయలేదన్నారు. ఢిల్లీలో పీవీ అంతిమ యాత్రకు కూడా కాంగ్రెస్ అనుమతి ఇవ్వలేదని విమర్శించారు.
పీవీ సంస్కరణలు.. దేశ ప్రగతికి బాటలు: ఏఐసీసీ చీఫ్ ఖర్గే
దేశ ప్రగతికి, నిర్మాణానికి మాజీ ప్రధాని పీవీ చేసిన కృషిని దేశం ఎల్లప్పుడూ స్మరించుకుంటుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ వేదికగా కొనియాడారు. ‘‘పీవీ ప్రవేశపెట్టిన విప్లవాత్మక ఆర్థిక సరళీకరణ విధానాలు దేశాన్ని పరుగులు పెట్టించాయి. మధ్య తరగతి ప్రజలకు అవకాశాలను విస్తృతం చేశాయి. దేశం అణు రంగంలో సాధించిన అద్భుతమైన ప్రగతితోపాటు, దౌత్యపరమైన అడుగులకూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తూర్పు దేశాలతో సంబంధాలను బలోపేతం చేసేందుకు తీసుకొచ్చిన ‘లుక్ ఈస్ట్’ విధానం ఆయన విజనరీ లీడర్ షిప్‌లో ఒక మైలురాయి”అని ఖర్గే పేర్కొన్నారు.
ఢిల్లీలో పీవీ జయంతి వేడుకలు
దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ప్రభుత్వం పీవీ నర్సింహారావు జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. ఇందులో భాగంగా భవన్‌లోని అంబేడ్కర్ ఆడిటోరియంలో పీవీ చిత్ర పటానికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ(రెసిడెంట్ కమిషనర్) శశాంక్ గోయల్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి పీవీ అందించిన సేవల్ని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది, పీవీ అభిమానులు హాజరై నివాళులర్పించారు.
పీవీ సేవలు మరవలేనివి: ప్రధాని మోదీ
దేశ చరిత్రలో ఒక సమర్థవంతమైన పాలకుడిగా మాజీ ప్రధాని పీవీ నరసింహా రావు తనదైన ముద్ర వేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ ప్రగతిలో ఆయన పాత్ర మరువలేనిదని గుర్తు చేసుకున్నారు. పీవీ జయంతి సందర్భంగా మోదీ ఆయనకు నివాళులర్పించారు. ‘‘మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా ఆయనకు నా ఘన నివాళులు. దేశ చరిత్రలోనే అత్యంత కీలకమైన తరుణంలో దేశ ప్రగతికి ఆయన మరువలేని సేవలు అందించారు. భారతదేశపు విభిన్న సంస్కృతిపై అపారమైన జ్ఞానం, అవగాహన కలిగిన ఒక గొప్ప పండితుడు ఆయన” అని మోదీ ‘ఎక్స్’లో స్మరించుకున్నారు.
