ఒక యోధుని అంతరంగం ఆవిష్కరించే.. భగత్ సింగ్ సమగ్ర గ్రంథం

ఒక యోధుని అంతరంగం ఆవిష్కరించే.. భగత్ సింగ్ సమగ్ర గ్రంథం

భగత్​సింగ్ పేరు తెలియని భారతీయులుండరు అంటే అతిశయోక్తి కాదు. దేశం కోసం నవ్వుతూ ఉరితాడును ముద్దాడిన ఆ అమరవీరుడి త్యాగం తరతరాలకూ స్ఫూర్తిదాయకం. టోపీ ధరించి, చురుకైన చూపులు, కోరమీసాలు, చేతిలో తుపాకీతో ఉండే ఆయన రూపం ప్రజల గుండెల్లో శాశ్వత ముద్రితం. అందుకే ఇప్పటి జెన్ – జీ తరం కూడా ఆ యోధుడి పేరును, రూపాన్ని ఠక్కున గుర్తుపట్టగలరు. అయితే, ఆయన ధీరత్వం గురించి మాత్రమే అందరికీ తెలుసు. కానీ, దాని వెనక ఉన్న ఆలోచన, ప్రగతిశీల భావన, దార్శనికత గురించి తెలిసింది చాలా తక్కువ. ఆ లోటును కాస్తంతయినా భర్తీ చేసే ప్రయత్నమే ‘భగత్ సింగ్ – ఒక సమగ్ర అవగాహన’ పుస్తకం. రచయిత, ప్రొఫెసర్ చమన్ లాల్ రాసిన ‘అండర్​స్టాడింగ్ భగత్ సింగ్’ రచనకు బోడపట్ల రవీందర్ తెలుగు అనువాదం ఈ పుస్తకం. ఇందులో.. భగత్ సింగ్ జైల్లో గడిపిన రెండేళ్ల కాలంలో రాసిన వందకు పైగా డాక్యుమెంట్లు, 

టెలిగ్రామ్​లు, ఉత్తరాలు, జైలు నోట్​బుక్​లను విశ్లేషిస్తూ, ఆ యోధుడి అంతరంగాన్ని పాఠకుల ముందు ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే భగత్ సింగ్ ఆలోచనా విధానం, రాజకీయ దృక్పథం, సామాజిక చైతన్యం, విప్లవ సిద్ధాంతాల సమ్మేళనమే ఈ రచన.భగత్ సింగ్​ది విప్లవ భావజాలమా? తీవ్రవాద సిద్ధాంతమా? ఆయన మార్క్సిజం వైపు మొగ్గు చూపారా? సోషలిజాన్ని కోరుకున్నారా? గాంధీజీ సిద్ధాంతాలను వ్యతిరేకించారా? విభజనవాదం తలెత్తుకున్న జిన్నా.. భగత్ సింగ్​ను ఎందుకు మెచ్చుకున్నారు? రక్తపాతంతోనే స్వాతంత్య్రం సిద్ధిస్తుందని భగత్ సింగ్ అనుకున్నారా? తదితర ప్రశ్నలకు జవాబులతోపాటు వాటి వెనక ఉన్న కారణాలు, లక్ష్యాలను అర్థవంతంగా వివరించారు. వీటి ఆధారంగా భగత్ సింగ్ వ్యక్తిత్వాన్ని 360 డిగ్రీల కోణంలో విశదీకరించారు. 

ఆవేశపరుడిగా క(అ)నిపించే భగత్ సింగ్ వ్యక్తిత్వం వెనక గొప్ప ఆశయాలు ఉన్నాయని ఈ పుస్తకం చదువుతుంటే అర్థమవుతుంది. 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం ఉరికంబం ఎక్కడం వెనక దార్శనికత ఉందని తెలుస్తుంది. స్వాతంత్య్రంతోపాటు సమసమాజం కోసమూ తపించినట్లు అవగతమవుతుంది. భగత్ సింగ్ కేవలం పోరాటయోధుడైన దేశభక్తుడు మాత్రమే కాదని, ముందుచూపున్న యువకుడు, అధ్యయనశీలి, సామాజిక మార్పును కోరుకున్న మేధావి అని అర్థమవుతుంది.  

లాహోర్ కుట్ర కేసు, అసెంబ్లీలోకి బాంబు విసరడం వంటి సంఘటనలు ఎప్పటిలాగే ఉద్వేగంతో చదివిస్తాయి. భగత్ సింగ్​ను, సహచరులను ఉరితీసే సందర్భం చదివేటప్పుడు మనసు బాధతో మెలిపెడుతుంది. స్నేహితులు, సహచరులతో ఆయన అనుబంధం కట్టిపడేస్తుంది. ఒక లక్ష్యం కోసం చిన్నప్పటినుంచి తనను తాను మలచుకున్న తీరు, ఆ క్రమంలో ఆయన చూపిన నిబద్ధత, చిత్తశుద్ధి, పట్టుదల స్ఫూర్తి రగిలిస్తుంది.

భగత్ సింగ్ కుటుంబం, బాల్యం గురించి కూడా పుస్తకంలో ఉన్నప్పటికీ, ఆయన జైలు జీవితంలోని అంశాలే ఎక్కువగా పుస్తకంలో కనిపిస్తాయి. అందువల్ల కొన్ని అంశాలు పునరావృతమైనట్లు అనిపిస్తుంది. అలాగే రాజకీయ, సిద్ధాంత పరమైన చర్చలు ఎక్కువగా ఉండడం వల్ల సాధారణ పాఠకులకు కొంచెం కష్టంగా అనిపించొచ్చు. భాష సరళంగా ఉంది. ఆయా సంఘటనలను వివరించేటప్పుడు చారిత్రక ఆధారాలు జోడించడం బాగుంది. వాటి విశ్లేషణ కూడా మెప్పిస్తుంది. భగత్ సింగ్​తో కలిసి నడిచిన వ్యక్తులు, ఆయన గురించి తెలిసినవాళ్లు, అప్పటి ప్రముఖులు, జర్నలిస్ట్​ల అభిప్రాయాలు, వార్తలు, వ్యాసాలను చేర్చడం వల్ల రచయిత చెప్పాలనుకున్న అంశానికి బలం చేకూరింది.  

దేశభక్తి, సామాజిక బాధ్యత, విమర్శనాత్మక ఆలోచన విధానంపై ఆసక్తి పెంచే ఈ పుస్తకం అందరికీ నచ్చుతుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ, సామ్రాజ్యవాద దోపిడీ వెర్రితలలు వేస్తున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా యువత కచ్చితంగా చదవాల్సిన పుస్తకమిది.

                   ‌‌- జి. మహేశ్వర్