ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ పథకాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ పథకాలు : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 

నేలకొండపల్లి, వెలుగు : ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని అప్పలనరసింహాపురం, రాజారాంపేట, కొరట్లగూడెం గ్రామాల్లో మంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. రాజారాంపేటలో చిన్నారికి పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుందని, మహిళా సంఘాలతో రైస్ మిల్లులు ఏర్పాటు చేయిస్తామన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలతో నేలకొండపల్లి మండలంలో రాష్ట్రంలో ప్రప్రథమంగా రైస్ మిల్లును ప్రారంభిస్తామని హామీనిచ్చారు. ఇప్పటికే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, త్వరలోనే 2, 3, 4 విడతలు కూడా అమలు చేస్తామన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని, రైతులు వారి సూచనలతో పంటలు మార్పిడీ చేసుకోవాలని కోరారు. కార్యక్రమాల్లో ఇల్లందు, భద్రాచలం, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.