భద్రాచలం, వెలుగు: నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తాలిపేరు ప్రాజెక్టు నీటిని సాగు, తాగునీటి అవసరాలకు ప్రణాళికాబద్ధంగా వినియోగించుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్ ఆఫీసర్లను ఆదేశించారు. బుధవారం చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టును సందర్శించిన కలెక్టర్ ప్రస్తుత నీటిమట్టం, ఇన్‌ఫ్లో, నీటి విడుదల, ప్రాజెక్టు నిర్వహణ తదితర అంశాలను ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా, ప్రస్తుతం 73.80 మీటర్లుగా ఉందని అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్ నుంచి 2,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, రానున్న రోజుల్లో ప్రవాహం తగ్గే అవకాశం ఉందని వివరించారు.
ఎడమ కాల్వ ద్వారా 200, కుడి కాల్వ ద్వారా 30 క్యూసెక్కుల నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం ప్రాజెక్టు కంట్రోల్ రూమ్‌ను పరిశీలించి నిర్వహణ, సిబ్బంది తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. చర్లలోని ఏకలవ్య మోడల్ స్కూల్‌ను సందర్శించి వంటశాల, తరగతి గదులు, విద్యాబోధనను పరిశీలించారు. పాఠశాలలోని హెల్త్ సెంటర్‌లో మందుల నిల్వ, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
