వేటగాళ్ల ఉచ్చుకు బీట్ ఆఫీసర్ బలి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో ఘటన

వేటగాళ్ల ఉచ్చుకు బీట్ ఆఫీసర్ బలి.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ ప్రాంతంలో ఘటన
  • అడవి పందుల కోసం అమర్చిన కరెంట్ తీగలు తగిలి ఎఫ్​బీవో నవీన్ మృతి
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నకిరిపేట అటవీ ప్రాంతంలో ఘటన
  • నవీన్​ స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా

ఖమ్మం/ బూర్గంపాడు/ కారేపల్లి, వెలుగు: అడవిలో వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన ఉచ్చుకు బీట్ ఆఫీసర్ బలయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం నకిరేపేట అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పాల్వంచ రేంజ్​ పరిధిలోని చెరువుసింగారం వెస్ట్ బీట్ లో వన్యప్రాణులను వేటాడుతున్నారనే సమాచారం రావడంతో ఐదుగురు అటవీ శాఖ సిబ్బంది రాత్రి 9 గంటల ప్రాంతంలో ఫీల్డ్ కు వెళ్లారు. 

స్పాట్​వద్ద అడవిపందుల కోసం అమర్చిన కరెంట్ తీగలు తగిలి బీట్ ఆఫీసర్​బానోత్ నవీన్​ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆయన వెంట ఉన్న సిబ్బంది వెంటనే కరెంట్ తీగలను తొలగించి, అతన్ని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. నవీన్​ ను పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్టు తెలిపారు. నవీన్​ స్వస్థలం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం వెంకిట్యాతండా. ప్రస్తుతం నవీన్​ తల్లి బూలి ఆ గ్రామ సర్పంచ్​ గా ఉండగా, తండ్రి గతంలో కారేపల్లి మండల ఎంపీపీగా పనిచేశారు.

 కాగా, నకిరిపేట అటవీ ప్రాంతంలో విద్యుత్ ఉచ్చులు అమర్చుతున్నారని మంగళవారం మధ్యాహ్నం సమాచారం రాగా ఆ ప్రదేశానికి వెళ్లి వాటిని తొలగించారని నవీన్​ కుటుంబ సభ్యులు తెలిపారు. రాత్రి 9 గంటలకు మళ్లీ ఉచ్చులు బిగించారన్న సమాచారం రావడంతో డీఆర్వో, మరో ముగ్గురు సిబ్బందితో కలిసి నవీన్ అక్కడికి వెళ్లారు. మధ్యాహ్నం వెళ్లినచోట ఉచ్చులు లేకపోవడంతో కొంత ముందుకు వెళ్లగా అక్కడ పెట్టిన విద్యుత్ ఉచ్చు నవీన్ కాలుకు తగిలి షాక్ కు గురయ్యాడు. లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆవుల నాగిరెడ్డి, దాసరి నరేశ్, తాటి వీరబాబు కరెంటు తీగలు అమర్చినట్టు గుర్తించారు. డీఆర్ఓ ఫిర్యాదు మేరకు ఆ ముగ్గురిపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. 


రెండు నెలల క్రితమే ట్రాన్స్​ఫర్


పదో తరగతి వరకు కారేపల్లిలో చదివిన నవీన్​ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడియట్​పూర్తిచేశాడు. హైదరాబాద్ లోని గురు నానక్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. పోటీ పరీక్షలకు హాజరై 2019 లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ప్రాంతంలో ఐదేండ్లు పనిచేసిన నవీన్..​ 2 నెలల కిందటే చెరువుసింగారం బీట్ కు ట్రాన్స్​ ఫర్​ అయ్యాడు. నవీన్ కు భార్య, ఐదేండ్ల కూతురు, మూడేండ్ల కుమారుడు ఉన్నారు. 

నవీన్ అంత్యక్రియలు బుధవారం స్వగ్రామమైన వెంకిట్యాతండాలో జరిగాయి. అంతిమయాత్రలో గ్రామస్తులు, ఫారెస్ట్ అధికారులు పాల్గొన్నారు. ఖమ్మం కలెక్టర్ దివాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, రాములు నాయక్ తదితరులు నవీన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. 

బీట్ ఆఫీసర్ మృతిపై  మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి


నవీన్ మృతిపై  మంత్రి కొండా సురేఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో నవీన్ ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అతని మృతికి బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలపై భద్రాద్రి జిల్లా డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఓ సిద్ధార్థ విక్రమ్ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మంత్రి కొండా సురేఖ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మాట్లాడి ఆరా తీశారు.