- కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లయినా ఆరు గ్యారంటీలు అమలు చేయలె
- వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని వెల్లడి
వికారాబాద్, వెలుగు: అప్పులు చేసి సంక్షేమ పథకాలు అమలు చేసిన మొనగాడు కేసీఆర్ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం వికారాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆనంద్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా కేటీఆర్ హాజరై, మాట్లాడారు. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రూ.72 వేల కోట్ల మిగులు ఉండేదని, 2023లో కేసీఆర్ ప్రభుత్వం దిగి పోయేనాటికి రూ.3.52 లక్షల కోట్ల అప్పు అయిందన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం 9 ఏండ్లలో రూ.2.80 లక్షల కోట్ల అప్పు చేసిందని తెలిపారు. అప్పులు చేసిన కేసీఆర్ రూ.200 పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచి, 46 లక్షల మందికి ప్రతి నెలా పంపిణీ చేశారని గుర్తుచేశారు. 14 లక్షల మందికి షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి కింద రూ.లక్ష చొప్పున అందజేసినట్లు చెప్పారు. 15 లక్షల మందికి కేసీఆర్ కిట్ పథకం కింద ఆడపిల్ల జన్మిస్తే రూ.13 వేలు, మగ బిడ్డ జన్మిస్తే రూ.12 వేలు అందజేసినట్లు చెప్పారు.
గురుకుల పాఠశాలు ఏర్పాటు చేసి 7 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించారన్నారు. 33 మెడికల్, నర్సింగ్ కాలేజీలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 73 లక్షల మంది రైతులకు రైతుబంధు వేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ రాజ్యాంగ పదవిలో ఉండి, కేసీఆర్ రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించడం సరికాదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కలిస్తే స్పీకర్ గడ్డం ప్రసాద్ ధృతరాష్ట్రుడి వలె కండ్లకు గంతులు కట్టుకొని పార్టీ మారలేదని చెప్పడం దురదృష్టకరమని విమర్శించారు.
ఆరు గ్యారంటీలు ఏమయ్యాయ్..?
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు అవుతున్న ఇప్పటివరకు ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో చేవెళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లేరేషన్ కింద రూ.10 లక్షల దళిత బంధును రూ.12 లక్షలకు పెంచుతామనన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశా భావం వ్యక్తం చేశారు.
మూసీ నది సుందరీకరణ చేస్తామని చెబుతున్న సీఎం రేవంత్ రెడ్డి.. మూసీ నది జన్మించిన ప్రాంతంలో 12 లక్షల చెట్లను నరికి నేవీ రాడార్ ఏర్పాటుకు అనుమతి ఇవ్వడం ఎంత వరకు సబబు ప్రశ్నించారు. వికారాబాద్, తాండూర్, పరిగి, చేవెళ్ల ప్రాంతాలకు నీటిని అందించే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం పక్కనపెట్టిందని ఆరోపించారు.
వికారాబాద్ నియోజకవర్గంలోని 284 పోలింగ్ బూత్‌లలో జరిగే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, సర్ పక్రియ సక్రమంగా జరిగేలా వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీ ఇన్‌చార్జి రామచంద్రరావు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి, మహేశ్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
