హైదరాబాద్, వెలుగు: జన గణనలో ఓబీసీ కులగణన చేపడ్తామని దేశంలోని 60 కోట్ల మంది ఓబీసీలను నమ్మించి కేంద్రం మోసం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కులగణన చేపట్టి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు పెంచే వరకు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఓబీసీ సంఘాల నేతలు ప్రకటించారు. ఆదివారం రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ ఆధ్వర్యంలో మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా కేంద్రంలో గాంధీ చౌక్ నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు మహా ర్యాలీ చేపట్టారు.
ఈ ర్యాలీలో జాజుల శ్రీనివాస్ గౌడ్ (తెలంగాణ), ఏపీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, బిహార్‌తో పాటు మరో 16 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు పాల్గొన్నారు. మహా ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టరేట్ మైదానం వద్ద జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి జాజుల మాట్లాడుతూ.. బీసీలను మోసం చేసిన కేంద్రానికి బుద్ధి చెప్పడానికి డిసెంబర్‌లో లక్షలాది మందితో ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో బీసీ గర్జన నిర్వహిస్తామని చెప్పారు.
