బెంగాల్‌‌ రాజకీయాలు ఇక్కడ నడ్వయ్.. నబీన్‌‌ మీటింగ్‌‌ ఫ్లాప్‌‌ షో: పీసీసీ చీఫ్ మహేశ్

బెంగాల్‌‌ రాజకీయాలు ఇక్కడ నడ్వయ్.. నబీన్‌‌ మీటింగ్‌‌ ఫ్లాప్‌‌ షో: పీసీసీ చీఫ్ మహేశ్



పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌
    హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం అడ్డంకులు తొలగించాకే మాట్లాడండి
    ‘కాళేశ్వరం’పై సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఫైర్​


హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ  అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటన, ఆ పార్టీ నిర్వహించిన సమావేశం కేవలం ఒక ఫ్లాప్ షోగా మిగిలిపోయాయని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌గౌడ్‌‌ పేర్కొన్నారు. కనీసం ఒక చిన్న సమావేశాన్ని కూడా సరిగ్గా నిర్వహించుకోలేని తెలంగాణ బీజేపీ నాయకులు, రాబోయే జీహెచ్‌‌ఎంసీ ఎన్నికల్లో సాధించేదేమీ లేదని ఎద్దేవా చేశారు. బూత్‌‌లు గెలుస్తాం.. కార్పొరేషన్లు కైవసం చేసుకుంటాం.. అంటూ ప్రగల్భాలు పలికే ముందు క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలను గ్రహించాలని ఆదివారం ఒక ప్రకటనలో హితవు పలికారు. ఇప్పటికే గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీ విభజన రాజకీయాలను తిరస్కరించారని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న అడ్డంకులను ముందుగా తొలగించి, ఆ తర్వాత వేరే విషయాల గురించి మాట్లాడాలని డిమాండ్ చేశారు. 

బెంగాల్‌ తరహా రాజకీయాలను ఇక్కడి ప్రజలు సహించరు

గత బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించేందుకు నితిన్ నబీన్ సిద్ధమా? అని మహేశ్‌కుమార్‌‌ గౌడ్‌ సవాల్‌ విసిరారు. లక్ష కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కేంద్రంలోని సీబీఐ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణ గడ్డపై బెంగాల్ తరహా విభజన రాజకీయాలు చేస్తామంటే ఇక్కడి ప్రజలు ఎంతమాత్రం సహించబోరని హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా పాలన అందించే ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతానికి చెందిన పీవీ నరసింహారావును దేశ ప్రధానిని చేసిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని కొనియాడారు. బీజేపీకి నగరాల పేర్లు మార్చడంపై ఉన్న శ్రద్ధ, ప్రజల జీవితాలను మార్చడంపై లేదని విమర్శించారు. కేవలం మతపరమైన రాజకీయం కోసమే పేర్ల మార్పు అంశాన్ని తెరపైకి తెస్తున్నారు తప్ప, నగరాల అభివృద్ధికి వీరి వద్ద ఎలాంటి రోడ్ మ్యాప్ లేదని అన్నారు.