- ఇక్కడి ప్రజల కలలు ఇంకా సాకారం కాలేదు: నితిన్ నబీన్
- అవినీతి, కుటుంబ పాలన
- రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి
- బీఆర్‌ఎస్‌కు ఏటీఎంలా కాళేశ్వరం..
- అవినీతిని కప్పిపుచ్చుతున్న కాంగ్రెస్
- భాగ్యనగరం భవిష్యత్తు మార్చేది బీజేపీయే
- తెలంగాణ ప్రజలకు బీజేపీపై నమ్మకముంది
- ఆ నమ్మకాన్ని పార్టీ బూత్ అధ్యక్షులు ముందుకు తీసుకెళ్లాలని పిలుపు
- 9 బీజేపీ జిల్లా కార్యాలయాలు ప్రారంభం..
- కులపిచ్చి రాజకీయాలు బంద్ చేయాలని బీజేపీ రాష్ట్ర నేతలకు వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నో హింసలను ఎదుర్కొని కమలం ఎలా వికసించిందో.. తెలంగాణలో కూడా అదే చరిత్ర పునరావృతం కాబోతున్నదని నితిన్ నబీన్ అన్నారు. బెంగాల్‌లో గెలిచామని, అక్కడ ఇన్‌చార్జీగా ఉన్న సునీల్ బన్సల్.. ఇప్పుడు ఇక్కడ కూడా ఇన్‌చార్జీగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, ప్రజా పోరాటాల ద్వారా ఎండగట్టాలని, గ్రామ గ్రామాన కార్యకర్తలు కదలాలని పిలుపునిచ్చారు. రాజకీయాలు అంటే అధికారం కోసం చేసేవి కావని, ప్రజలకు సేవ చేయడం కోసం చేసేవని చెప్పారు. ఆదివారం రంగారెడ్డి రూరల్ జిల్లా కార్యాలయంతోపాటు మరో 8 జిల్లా బీజేపీ కార్యాలయాల ప్రారంభోత్సవం నిర్వహించారు.
రంగారెడ్డి రూరల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్‌కర్నూల్ కార్యాలయాలను నితిన్ నబీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంభించుకున్న ఈ కార్యాలయాలు పార్టీ సిద్ధాంతాలను ప్రతిబింబించే సంకల్ప కేంద్రాలుగా, ప్రజలకు అండగా నిలిచే సేవా కేంద్రాలుగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. ‘నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్’ అనే నినాదమే బీజేపీ కార్యకర్తలకు దిక్సూచి అని తెలిపారు. ఎన్నో కష్టాలు, పోలీస్ లాఠీ దెబ్బలు, ప్రాణత్యాగాలతో తెలంగాణ నేలపై కమల వనాన్ని పూయించిన సీనియర్ కార్యకర్తలకు శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నట్టు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా స్వరాజ్ కృషిని, అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ కార్యకర్తలు అలుపెరగని పోరాటం చేస్తే.. ఆ ఫలితాన్ని కాంగ్రెస్ మోసపూరితంగా చేజిక్కించుకున్నదన్నారు. అధికారాన్ని కేవలం అనుభవించే సాధనంగా మార్చుకున్న పాలకులను గద్దెదించే శక్తి ఒక్క బీజేపీ కార్యకర్తలకే ఉందన్నారు.
తెలంగాణతో బీజేపీది దశాబ్దాల బంధం
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును పేదల సొమ్ము దోచుకోవడానికి ఒక ఏటీఎంలా వాడుకున్నదని, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారు ఆ అవినీతిని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని నితిన్ నబీన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కలలు ఇంకా సాకారం కాలేదని, అవినీతి, కుటుంబ పాలన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బూత్ లెవెల్ అధ్యక్షుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ శక్తిని చూస్తుంటే ఆనందంగా ఉందని, అంకితభావంతో పనిచేసే కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని కొనియాడారు. అధికారం అనేది ప్రజలపై పాలన చేయడానికి కాదని, సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమేనని ప్రధాని మోదీ నిరూపించారన్నారు. తెలంగాణకు బీజేపీ కొత్త పార్టీ కాదని, ఈ ప్రాంతంతో దశాబ్దాల బంధం ఉందని గుర్తుచేశారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీకి ఇద్దరే ఎంపీలు గెలిస్తే.. అందులో ఒకరు తెలంగాణ నుంచే ఎన్నికయ్యారని అన్నారు. తెలంగాణ ప్రజలకు బీజేపీపై ఉన్న విశ్వాసానికి ఇదే నిదర్శనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ పాత్ర కీలకమని, పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ రాజకీయ లాభ,నష్టాలు చూడకుండా గళమెత్తారని అన్నారు. సర్దార్ పటేల్ విజన్‌ను ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ రూపంలో మోదీ ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.
కాంగ్రెస్ హామీలన్నీ మోసమే..
ప్రజలు మార్పును కోరుకొని కాంగ్రెస్‌కు అవకాశం ఇస్తే.. ఆ పార్టీ పాత సంస్కృతినే కొనసాగిస్తోందని నితిన్ నబీన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ కేవలం అధికారంలోకి రావడానికే హామీలు ఇస్తుందని, 2 లక్షల ఉద్యోగాల విషయంలో యువతను మోసం చేసిందని తెలిపారు. ఇచ్చిన గ్యారంటీల్లో ఒక్కటి కూడా సరిగా అమలు కాలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ చేసిన మోసాలను యువ కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే జీహెచ్‌ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి బూత్ అధ్యక్షుడు మూడు సంకల్పాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలను వివరించాలని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని కోరారు. కేంద్ర పథకాల లబ్ధిదారులందరినీ కలిసి వారి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీతో నడవడానికి నగర ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అభివృద్ధి రాజకీయాలా? లేక కుటుంబ, అవినీతి రాజకీయాలా? అనేది ప్రజలే తేలుస్తారన్నారు. కాళేశ్వరం అవినీతి దోషులను శిక్షించే వరకు, ప్రజలకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
కుల పిచ్చి బంద్ చేయాలి
రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి మంచి వాతావరణం ఉన్నా, నేతలు దాన్ని వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని నితిన్ నబీన్ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా పార్టీలో పెరుగుతున్న గ్రూపు రాజకీయాలు, కుల సమీకరణాలపై మండిపడ్డారు.‘‘కుల పిచ్చి బంద్ చేయండి.. మీరు ఇలాగే ఉంటే పార్టీ ముందుకు పోదు. ఇకనైనా మారండి.. పార్టీ ఫస్ట్, లీడర్ నెక్స్ట్ అని గుర్తుంచుకోండి’’ అంటూ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆ పార్టీ రాష్ట్ర ముఖ్యనేతలతో నితిన్ నబీన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎవరెవరు ఏం చేస్తున్నారో, ఎక్కడెక్కడ క్రాస్ అవుతున్నారో తన దగ్గర రిపోర్ట్ ఉందని, పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో బీజేపీకి అధికారం దక్కేందుకు స్కోప్ ఉందని, ఐక్యంగా ఉంటేనే అది సాధ్యమని స్పష్టం చేశారు. నెల రోజుల్లోపు క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాడి పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించాలని డెడ్ లైన్ విధించారు. అధికారమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని ఆదేశించారు.
రియల్ ఎస్టేట్ అడ్డాగా హైదరాబాద్: రాంచందర్‌రావు
హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చేశారని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు అన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో ఒక రోజు వాన పడితేనే సగం నగరం మునిగిపోయేదని, ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పరిస్థితి మరీ ఘోరంగా తయారైందని తెలిపారు. చినుకు పడితే రోడ్లు జలమయమై, కరెంట్ షాక్‌లతో జనం ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రభుత్వం మాత్రం భూముల అమ్మకాలు, ఖజానా నింపుకోవడంపైనే దృష్టి పెట్టిందని మండిపడ్డారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా హైదరాబాద్ బీజేపీ అడ్డానేనని, రాబోయే మూడు కార్పొరేషన్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, తెలంగాణ ఇన్‌చార్జి సునీల్ బన్సల్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర ఇన్‌చార్జులు అభయ్ పాటిల్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చంద్రశేఖర్ తివారీ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్ ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, రంగారెడ్డి రూరల్ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్
తదితరులు పాల్గొన్నారు.
దారుస్సలాం కనుసన్నల్లోనే రేవంత్ సర్కార్: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో పాలన దారుస్సలాం కనుసన్నల్లోనే సాగుతోందని, పోలీస్ అధికారుల పోస్టింగులను కూడా అక్కడి నుంచే నిర్ణయిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఎలాంటి తేడా లేదని, రెండూ అవినీతి, కుటుంబ పాలనను ప్రోత్సహిస్తూ మజ్లిస్‌ను పెంచి పోషిస్తున్నాయని విమర్శించారు. హైదరాబాద్‌ను మజ్లిస్ పెత్తనం నుంచి రక్షించాలంటే తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని, కార్యకర్తలు రాబోయే మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సమరోత్సాహంతో సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ‘సర్’ కార్యక్రమం చూసి కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు ఎందుకు ఉలిక్కిపడుతున్నాయని ప్రశ్నించారు. పాతబస్తీలో తిష్టవేసిన రోహింగ్యాలు, బంగ్లాదేశీ అక్రమ వలసదారుల దొంగ ఓట్లను ఏరివేయాల్సిందేనని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బీజేపీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ఓటర్లను చైతన్యపరచాలని సూచించారు
