న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి, జులై 1 నుంచి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 'వీబీ జీ రామ్జీ' కొత్త చట్టంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఈ కొత్త చట్టం వల్ల దేశంలో అధికార కేంద్రీకరణ పెరిగిపోతుందని, రాష్ట్రాలపై మోయలేని ఆర్థిక భారం పడుతుందని ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ఆదివారం 'ఎక్స్' వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.
పార్లమెంటరీ కమిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలతో ఎలాంటి ముందస్తు సంప్రదింపులు జరపకుండానే కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కొత్త చట్టం వల్ల పడనున్న అదనపు వ్యయ భారాన్ని మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరాఖండ్ వంటి బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత రాష్ట్రమైన మధ్యప్రదేశ్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోందని పేర్కొన్నారు.
