వెలుగు స్పోర్ట్స్ డెస్క్: హాకీ.. ఒకప్పుడు ఇండియా గుండె చప్పుడు. ప్రపంచంలో ఎక్కడ టోర్నీ జరిగినా పతకం ఇండియాదే అన్న స్థాయిలో ఆడేది. ఆ జోరుతో ఎనిమిది స్వర్ణాలు, ఒక రజతం, నాలుగు కాంస్యా లతో ఒలింపిక్స్‌ను ఊపేసింది. మిగతా ఇంటర్నేష నల్ టోర్నీల్లోనూ అనేక పతకాలను కొల్లగొట్టింది. కానీ వరల్డ్ కప్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ముచ్చటగా మూడే పతకాలతో సరిపెట్టుకుంది. 1971లో బార్సిలోనాలో బ్రాంజ్ మెడల్‌ను నెగ్గిన ఇండి యా.. 1973లో అమ్‌స్టెర్‌డామ్‌లో సిల్వర్ మెడల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత 1975 కౌలాలంపూర్‌లో పాకిస్తాన్‌ను 2–1తో ఓడించి తొలిసారి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. ఇక అక్కడి నుంచి ఏ వరల్డ్ కప్‌లోనూ ఇండియా పతకం దిశగా అడుగులు వేయలేదు.
1971లో వరల్డ్ కప్ మొదలైతే తొలి మూడుసార్లు ఇండియా పతకాలు గెలిచింది. కానీ 1975 తర్వాత జరిగిన వరల్డ్ కప్ నుంచి ఇండియా పతనం మొదలైంది. ఆ తర్వాత 12సార్లు టోర్నీలో పాల్గొన్నా.. చిన్న జట్లపై కూడా విజయాలు సాధించలేని స్థితికి చేరుకుంది. ఫలితంగా 2023 వరకు కనీసం సెమీస్ బెర్త్‌ను కూడా ఖాయం చేసుకోలేకపోయింది.
ఒకప్పుడు ధ్యాన్‌చంద్, బల్బీర్ సింగ్ వంటి దిగ్గజాల ఆటతో మురిసిన ఇండియా హాకీ.. ఆ తర్వాత వచ్చిన కొత్త తరం ప్లేయర్ల ఆటతో అనేక విమర్శలను ఎదుర్కొంది. 1980 ఒలింపిక్స్‌లోనూ స్వర్ణం గెలిచినా.. వరల్డ్ కప్‌లో మాత్రం పతకం సాధించకపోవడంతో విమర్శల దాడి ఎక్కువైంది. దీనికితోడు పొరుగు దేశం పాకిస్తాన్ నాలుగుసార్లు వరల్డ్ కప్ గెలవడం అభిమానులకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది.
టర్ఫ్‌లే శాపమా..?
ఒకప్పుడు సాధారణ గ్రౌండ్స్‌ల్లో ఆడిన హాకీ క్రమంగా కృత్రిమ టర్ఫ్ వైపు మళ్లింది. దీనికి ఇండియా ప్లేయర్లు ఎక్కువగా అలవాటు పడలేకపోయారు. ఓటములకు ఇదో కారణమైతే.. రెండోది కొత్తగా వచ్చిన నిబంధనలు. వీటిని సరిగా అర్థం చేసుకోలేకపోవడంతో ఇండియా హాకీ క్రమంగా ప్రాభవం కోల్పోయింది. అదే టైమ్‌లో యూరోప్ దేశాల ప్లేయర్లు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వడంతో ఆటలో వేగం పెరిగింది. కానీ ఈ రెండు విషయాల్లో ఇండియా ప్లేయర్లు బాగా వెనకబడిపోయారు.
ఫలితంగా సరైన ఫిట్‌నెస్ లేకపోవడంతో ఆటలో వేగం తగ్గింది. దాంతో వరల్డ్ కప్స్‌తో పాటు ఒలింపిక్స్‌లోనూ ఇండియా పెర్ఫామెన్స్ తగ్గుతూ వచ్చింది. పదేళ్ల పాటు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనైన ఇండియా ఫారిన్ కోచ్‌ల రాకతో మళ్లీ పుంజుకున్నట్లు కనిపించింది. 2020 టోక్యో, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్స్, ఆసియా క్రీడల్లో పతకం గెలవడంతో ఇండియా హాకీకి పూర్వ వైభవం వచ్చిందని భావించారు.
ఇంతవరకు బాగానే ఉన్నా వరల్డ్ కప్‌కు వచ్చేసరికి అసలు కథ మొదలవుతుంది. కనీస పోటీ ఇచ్చే స్థాయిలో కూడా ఇండియా పెర్ఫామెన్స్ ఉండటం లేదు. 2014లో నెదర్లాండ్స్‌లో జరిగిన టోర్నీలో 9వ స్థానం, ఆ తర్వాత 2018, 2023 సొంతగడ్డపై జరిగిన టోర్నీల్లో వరుసగా 6, 9వ స్థానంలో నిలిచింది.
ఈసారైనా..?
ఐదు దశాబ్దాలకు నిరీక్షణకు ఈసారైనా తెర దించాలని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కోరుకుంటున్నా.. ఈసారి కూడా ఆ కల ఫలించేలా లేదు. ఎందుకంటే టోర్నీకి బెల్జియం, నెదర్లాండ్స్ ఆతిథ్యమిస్తుండటంతో ఇండియాపై పెద్దగా అంచనాల్లేవు. గ్రూప్–డిలో ఇంగ్లండ్, పాకిస్తాన్, వేల్స్‌తో కఠినమైన పోటీ ఎదురుకానుంది. 16 జట్లు పాల్గొంటున్న టోర్నీలో గోల్డ్ మెడల్‌ను పక్కబెట్టి కనీసం సెమీస్ చేరినా సంతోషమే అన్నట్లుగా ఉంది.
2025 ఆసియా కప్‌కు పాకిస్తాన్ దూరంగా ఉండటంతో ఆ టోర్నీ గెలిచిన ఇండియా వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎఫ్‌ఐహెచ్ ప్రో లీగ్‌లో మళ్లీ నిరాశజనక ప్రదర్శనే. 9 జట్లు బరిలో ఉంటే ఇండియా 8వ స్థానంతో సరిపెట్టుకుంది.
వరల్డ్ కప్‌కు ముందు రూర్కెలా ప్రో లీగ్‌లో ఇండియా నెదర్లాండ్స్, జర్మనీని ఓడించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచే అంశం. ప్రస్తుత జట్టు కూడా మంచి ఫామ్‌లో ఉంది. సొంత మైదానంలో మ్యాచ్‌లు లేవు కాబట్టి జట్టుపై పెద్దగా ఒత్తిడి ఉండదు. డిఫెన్స్ ఇండియాకు అతిపెద్ద బలం.
అత్యుత్తమ పెనాల్టీ కార్నర్ ప్లేయర్ అయిన హర్మన్‌ప్రీత్ సింగ్ ఆటపైనే ఇండియా ఎక్కువగా ఆధారపడి ఉంది. కాకపోతే మిడ్‌ఫీల్డ్ బలహీనతలను కూడా దృష్టిలో ఉంచుకుంటే మంచిది. ఓవరాల్‌గా గత వైఫల్యాలను మర్చిపోయే విధంగా మైదానంలో సమష్టిగా ఆడి విజయాలు సాధిస్తే పతకాలు వాటంతటే అవే వస్తాయి.
అమ్మాయిలు ఏం చేస్తారో..?
మెన్స్ టోర్నీతో పాటు విమెన్స్ మ్యాచ్‌లు కూడా ఉండటంతో ఈసారి టోర్నీపై కొద్దిగా ఆసక్తి పెరిగింది. అయితే మెన్స్ జట్టుతో పోలిస్తే ఇండియా అమ్మాయిల జట్టు చాలా బలహీనం. 1974 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరి పతకంపై ఆశలు రేపినా.. నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాత 2018లో రాణి రాంపాల్ సారథ్యంలో క్వార్టర్స్‌కు చేరింది. కానీ పెనాల్టీ షూటౌట్‌లో ఐర్లాండ్ చేతిలో ఓడి రిక్త హస్తాలతో వెనక్కి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఐదు టోర్నీల్లో నిరాశపర్చింది. 2022 టోర్నీలో 9వ స్థానంతో సరిపెట్టుకుంది.
కాబట్టి ఈసారి కూడా పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోంది. ఈసా రి కూడా ఇండియాకు కఠినమైన డ్రానే ఎదురైంది. గ్రూప్–డిలో చైనా, ఇంగ్లండ్, సౌతాఫ్రికాతో తలపడనుం ది. ఇందులో గెలిచి ముందడుగు వేయడం మనోళ్లకు కత్తిమీద సవాలే. టోర్నీ కోసం ఎంపిక చేసిన జట్టులో ఎక్కువ మంది యంగ్‌స్టర్స్ ఉన్నా.. చాలా మందికి ఇదే తొలి వరల్డ్ కప్ కావడంతో సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని అధిగమించి ఎంతవరకు వెళ్తారో చూడాలి.
