భయంతోనే అమిత్ షా సభకు రాలే.. సభ నిర్వహణ ఖర్చులు రూ.250 కోట్లు మోపాలి: ఎంపీ వంశీకృష్ణ

భయంతోనే అమిత్ షా సభకు రాలే.. సభ నిర్వహణ ఖర్చులు రూ.250 కోట్లు మోపాలి: ఎంపీ వంశీకృష్ణ

న్యూఢిల్లీ, వెలుగు: ప్రశాంతంగా ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల క్రూరమైన దాడి, లాఠీచార్జ్, పెల్లెట్ కాల్పులు, ఏకే–47 ఎక్కుపెట్టడం వంటి అంశాలపై దేశ యువతకు, ప్రజలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ డిమాండ్ చేశారు. గురువారం పార్లమెంట్ చివరి రోజు లోక్ సభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం మకర ద్వారం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. విద్యార్థులపై లాఠీచార్జ్‌‌కు సమాధానం చెప్పాల్సి వస్తుందన్న భయంతో.. 20 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలకు అమిత్ షా ముఖం చాటేశారని విమర్శించారు.

 పార్లమెంట్‌‌లోని తన చాంబర్‌‌‌‌కు వచ్చిన షా.. పిరికివాడిలా సభలోకి రాకుండా ఉన్నారని ఫైర్ అయ్యారు. ఆయన సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు పట్టుబట్టడం, తప్పించుకునేందుకు సభ స్పీకర్ వాయిదా వేయడం పరిపాటిగా సాగిందన్నారు. దీంతో దాదాపు రూ.250 కోట్ల ప్రజా ధనంతో నిర్వహించిన పార్లమెంట్ సమావేశాలు అర్థరహితంగా ముగిశాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి కారణమైన అమిత్​షానే పార్లమెంట్ నిర్వహణ ఖర్చు భరించాలని, ఆయనపై ఈ భారాన్ని మోపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

 ‘‘ఒకవైపు ప్రతిపక్షమంతా ఈ చర్యలకు ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించింది. కానీ దురదృష్టవశాత్తు సభలో రెండు వర్గాలు ఉన్నాయి. ఒకటి ఆర్‌‌ఎస్‌‌ఎస్ భావజాలం, మరొకటి ‘అంధభక్త’భావజాలం. రాహుల్ గాంధీ చెప్పినట్లు ఇంకొక వర్గం ‘దేశభక్తి’వర్గం. సభలో మేము ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచడానికి చూస్తున్నాం. సభలో దేశ ప్రజల గొంతును వినిపిస్తున్నాం. కానీ ఈ సమావేశాలు సరిగ్గా జరగడం లేదు. ప్రభుత్వం కేవలం బుల్డోజర్లతో ముందుకు నెట్టడానికి ప్రయత్నిస్తోంది. దేశ ప్రజలకు, జెన్‌‌జీకి వ్యతిరేకంగా ఉన్న బిల్లులను బలవంతంగా ఆమోదింపజేయడానికి మాత్రమే ప్రయత్నిస్తోంది” అని వంశీకృష్ణ మండిపడ్డారు.