టీవీకే సర్కారు ఇంకెంతో కాలం ఉండదు: మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

టీవీకే సర్కారు ఇంకెంతో కాలం ఉండదు: మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై: తమిళనాడులో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఇంకెంతో కాలం ఉండదని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు నుంచి ఆరు నెలల్లోనే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందన్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో స్టాలిన్ మాట్లాడుతూ, టీవీకే ప్రభుత్వం ప్రజామద్దతుతో కాకుండా, తమ కూటమి నుంచి విడిపోయిన పార్టీల మద్దతుతో నెట్టుకొస్తోందని విమర్శించారు.

 టీవీకే కేవలం 108 సీట్లతో మైనారిటీ ప్రభుత్వంగా కొనసాగుతోందని ఆయన గుర్తుచేశారు. ‘ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు’ అని హెచ్చరించారు. ఐదేళ్ల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. 

గత ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల తర్వాత కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ వంటి పార్టీలు డీఎంకేతో తెగదెంపులు చేసుకుని టీవీకేకు మద్దతు ప్రకటించాయి. తాజాగా శనివారం వైకో నేతృత్వంలోని ఎండీఎంకే కూడా డీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు తెలపడం గమనార్హం.