- ఖమ్మం సభ నుంచి మొదలు
- పెట్టుబడి సాయం పంపిణీకి రూ. 9 వేల కోట్లు
- జులై 15లోపు రైతులందరికీ పూర్తిగా జమ చేసేలా ప్రణాళిక
- బ్యాంకుల్లో క్యాష్ సర్దుబాటు చేయాలని ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ
- ఉద్యోగుల బకాయిలకు రూ. 2 వేల కోట్లు
- శాలరీలు, పెన్షన్లు, స్కీమ్‌లతో జులై ఒక్క నెలలోనే
- దాదాపు 20 వేల కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం
- ఆర్‌బీఐ నుంచి 11,500 కోట్ల రుణం
- తీసుకోవడంతోపాటు రాష్ట్ర సొంత ఆదాయం సర్దుబాటు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్నదాతలకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను సిద్ధం చేసింది. వానాకాలం సీజన్ ‘రైతు భరోసా’ పథకం పంపిణీ ప్రక్రియ ఈ నెల 30 నుంచి ప్రారంభం కానుంది. ఖమ్మంలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదికగా ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేసేందుకు సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకుగాను ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.9 వేల కోట్లు సిద్ధం చేసినట్టు సమాచారం. రాబోయే జులై 15వ తేదీ కల్లా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అర్హులైన రైతులందరి ఖాతాల్లోకి ఈ నిధులు పూర్తిగా చేరేలా ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికనురూపొందించుకొని ముందుకు సాగుతోంది. క్షేత్రస్థాయిలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, బ్యాంకుల ద్వారా నేరుగా నగదు బదిలీ చేసేందుకు అవసరమైన అన్ని రకాల సాంకేతిక, పరిపాలనాపరమైన అనుమతులను సంబంధిత అధికారులు ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. రైతు భరోసా నిధులు మొత్తం 10–-15 రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా పలు కీలక చర్యలు చేపట్టింది. దీంతోపాటు ఉద్యోగుల బకాయిలకు రూ. 2 వేల కోట్లు , వారి శాలరీలు, పెన్షన్లు, ఆసరా పింఛన్లు ఇవ్వనున్నందున క్షేత్రస్థాయిలో ఎక్కడా నగదు కొరత రాకుండా చూసేందుకు, బ్యాంకుల్లో తగినంత క్యాష్ సర్దుబాటు చేయాలని కోరుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినట్టు తెలుస్తోంది.
జులై మొదటి రెండు వారాల పాటు రైతుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉన్నందున, బ్యాంకింగ్ సేవల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు కూడా స్థానిక బ్యాంకు ప్రతినిధులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
70 లక్షల మంది రైతులకు.. కోటి 50 లక్షల ఎకరాలకు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 లక్షల మంది రైతులకు.. కోటి 50 లక్షల ఎకరాలకు.. ఎకరాకు 6 వేల చొప్పున జమ చేయనున్నట్టు అధికారులు చెబుతున్నారు. పెట్టుబడి సాయంతోపాటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి సారించి నిధులు కేటాయించింది. ఉద్యోగులకు దీర్ఘకాలంగా బకాయి ఉన్న వివిధ రకాల ఏరియర్స్ చెల్లింపుల కోసం ప్రతినెలా ఇస్తామని చెప్పిన దాదాపు రూ.2వేల కోట్లను ప్రత్యేకంగా సిద్ధం చేసింది. ఈ బకాయిలను కూడా జులై నెలలోనే పూర్తిగా క్లియర్ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు అన్నదాతలకు పెట్టుబడి సాయం అందిస్తూనే, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించే ఉద్యోగుల బకాయిలను చెల్లించనుంది. రాబోయే జులై నెలలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, పరిపాలన కోసం అత్యంత భారీ స్థాయిలో నిధులను ఖర్చు చేయబోతోంది. సాధారణంగా వచ్చే నెలవారీ ఉద్యోగుల శాలరీలు, పెన్షన్లకు రూ. 6 వేల కోట్లతోపాటు రైతు భరోసా, ఉద్యోగుల బకాయిలులాంటి ఇతర ముఖ్యమైన పథకాలను కలుపుకొని జులై ఒక్క నెలలోనే దాదాపు రూ.20వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది.
ఇంతటి భారీ మొత్తాన్ని ఒకేసారి సర్దుబాటు చేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ కావడంతో ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీనికోసం ఆర్‌బీఐ నుంచి సుమారు రూ.11,500 కోట్ల మేర రుణం సేకరించడంతోపాటు రాష్ట్రానికి వచ్చే సొంత ఆదాయ వనరులను (స్టేట్ ఓన్ రెవెన్యూ) కూడా దీనికి తగ్గట్టుగా మళ్లించనున్నారు. ఈ రెండు మార్గాల ద్వారా లభించే నిధులను సమర్థవంతంగా మేనేజ్ చేస్తూ, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా జులై నెల ఖర్చులను అధిగమించేందుకు ఆర్థిక శాఖ పూర్తి కసరత్తు చేస్తోంది.
