న్యూఢిల్లీ: రోమేనియా వేదికగా క్లే కోర్టుపై జరిగిన ఇంటారో ఓపెన్ టైటిల్‌ను భారత టెన్నిస్ స్టార్ సుమిత్ నాగల్ కైవసం చేసుకున్నాడు. హోరాహోరీగా జరిగిన ఫైనల్ పోరులో ఫ్రాన్స్‌కు చెందిన ఫెలిక్స్ బాల్షాను 6–-3, 7–-5 తేడాతో వరుస సెట్లలో మట్టికరిపించాడు. దీంతో రెండేండ్లకుపైగా ఎదురు చూస్తున్న ఏటీపీ చాలెంజర్ టైటిల్ కరువుకు తెరదించాడు.
మట్టి కోర్టులపై నాగల్‌కు ఉన్న పట్టు ఎలాంటిదో ఈ మ్యాచ్ మరోసారి నిరూపించింది. అతడికి ఇది ఓవరాల్‌గా 7వ ఏటీపీ చాలెంజర్ సింగిల్స్ టైటిల్ కాగా.. క్లే -కోర్టులపై 5వ టైటిల్ కావడం విశేషం. 2024 జూన్‌లో జర్మనీలో జరిగిన హీల్‌బ్రాన్ చాలెంజర్ తర్వాత నాగల్ మళ్లీ చాలెంజర్ స్థాయిలో టైటిల్ గెలవడం ఇదే తొలిసారి. మ్యాచ్ ప్రారంభం నుంచే నాగల్ దూకుడును ప్రదర్శించాడు. తొలి సెట్‌ను 6–-3తో సులువుగానే చేజిక్కించుకున్నాడు.
రెండో సెట్‌లో ఫ్రెంచ్ ఆటగాడు బాల్షా గట్టి పోటీ ఇవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఒక దశలో స్కోరు సమం కావడంతో నాగల్‌పై ఒత్తిడి పెరిగినప్పటికీ, కీలక సమయాల్లో అద్భుతంగా రాణించి 7–-5 తేడాతో రెండో సెట్‌కు గెలుచుకుని మ్యాచ్‌ను ముగించాడు. ఈ విజయంతో నాగల్ ఖాతాలో 75 ఏటీపీ ర్యాంకింగ్ పాయింట్లు చేరాయి. త్వరలో విడుదల కానున్న కొత్త ర్యాంకింగ్స్‌లో అతడు వరల్డ్ నెంబర్ 219వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
