వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన అమ్మాయిలు

వరల్డ్ కప్ నుంచి భారత్ ఔట్.. కీలక మ్యాచ్లో చేతులెత్తేసిన అమ్మాయిలు

లండన్: సెమీస్​ చేరాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‎లో హర్మన్​సేన చేతులెత్తేసింది. ఆసీస్​చేతిలో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. పదో ప్రపంచకప్ ఆడుతున్న పెర్రీ (38బంతుల్లో 56), గార్డనర్ (29 బంతుల్లో 53 నాటౌట్) నాలుగో వికెట్‌‌‌‌కు 100 పరుగులు జోడించారు. దీంతో ఆసీస్..​ భారత్ విధించిన 171 పరుగుల లక్ష్యాన్ని 19 ఓవర్లలోనే ఛేదించి సెమీస్‏లో అడుగుపెట్టింది.  ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎల్లీస్ పెర్రీకి దక్కింది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌‌‌‌లో బంగ్లాదేశ్‌‌‌‌పై 4 వికెట్ల తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా 8 పాయింట్లతో సెమీస్​లోకి ప్రవేశించింది. 

అదరగొట్టిన పెర్రీ, గార్డనర్

171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఒక దశలో 9.1 ఓవర్లలో 68 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత బౌలర్లు ఓపెనర్లు ఫోబీ లిచ్‌‌‌‌ఫీల్డ్, జార్జియా వోల్, సీనియర్ బ్యాటర్ బెత్ మూనీలను తక్కువ పరుగులకే అవుట్ చేశారు. వోల్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రేణుకా సింగ్ విసిరిన పదునైన ఇన్‌‌‌‌ స్వింగర్‌‌‌‌కు క్లీన్ బౌల్డ్ అయింది. ఆ తర్వాత పెర్రీ, గార్డనర్ జోడి భారత బౌలర్లను సులువుగా ఎదుర్కొంది. 

35 ఏళ్ల పెర్రీ.. శ్రీ చరణి, షఫాలీ, దీప్తి శర్మ బౌలింగ్‌‌‌‌ను సులువుగా కట్, పుల్ షాట్లు ఆడుతూ 8 ఫోర్లతో ఇన్నింగ్స్ నడిపింది. 33 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. గార్డనర్ (29 బంతుల్లోనే) అర్ధ శతకాన్ని అందుకుంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన శ్రీ చరణి బౌలింగ్‌‌‌‌లోనే పెర్రీ చివరకు అవుట్ అయినప్పటికీ.. అప్పటికే ఆసీస్ 6 వికెట్ల తేడాతో విజయం ఖరారు చేసుకుంది. 

హర్మన్ ​ కెప్టెన్ ​ఇన్నింగ్స్​

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన భారత్.. కెప్టెన్ హర్మన్‌‌‌‌ప్రీత్ (27 బంతుల్లో 56) మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ 4 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేయగలిగింది. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) తొలి వికెట్‌‌‌‌కు 66 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు. పవర్‌‌‌‌ప్లే ముగిసేసరికి భారత్ 43/0 తో మంచి స్థితిలోనే ఉంది. 

కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్ వేగాన్ని పెంచే క్రమంలో ఆసీస్ కెప్టెన్ సోఫీ మోలీనెక్స్ బౌలింగ్‌‌‌‌లో భారీ షాట్‌‌‌‌కు ప్రయత్నించి షఫాలీ బౌల్డ్ అయింది. మంధాన సైతం జెమిమా రోడ్రిగ్స్ (34)తో జరిగిన మిస్ అండర్‌‌‌‌స్టాండింగ్ వల్ల రనౌట్ అయింది.

 జెమిమా ఫోర్‌‌‌‌తో ఇన్నింగ్స్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత క్రీజులో నిలవలేకపోయింది. చివరి ఓవర్లో భారీ హిట్టర్ రిచా ఘోష్‌‌‌‌కు అవకాశం ఇచ్చేందుకు జెమిమా 'రిటైర్డ్ అవుట్'గా వెనుతిరిగినా రిచా కేవలం ఒక్క బంతే ఎదుర్కొంది. హర్మన్​ధాటిగా ఆడడం వల్ల ఆఖరి ఓవర్లో 23 పరుగులు రావడంతో భారత్ 170 పరుగుల స్కోరును సాధించగలిగింది.