బెల్ఫాస్ట్: వరల్డ్ నంబర్ వన్ టీ20 జట్టుగా పేరుగాంచిన టీమిండియాను ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. బెల్ఫాస్ట్ వేదికగా ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఇండియా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐర్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది.
అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టును ఐర్లాండ్ బౌలర్లు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులకే నియంత్రించారు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ ఒంటరి పోరాటం చేస్తూ హాఫ్ సెంచరీ(55) సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఓపెనర్స్ అభిషేక్ శర్మ, సంజు శాంసన్ డకౌటై తీవ్రంగా నిరాశపర్చారు. ఇషాన్ కిషన్ 12, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 10 పరుగులకే వెనుదిరిగాడు.
చివర్లో హర్షిత్ రాణా పోరాడి 21 పరుగులు చేసినా ఇండియాకు ఓటమి తప్పలేదు. శివమ్ దూబే 20, అక్షర్ పటేల్ 14, సూర్యాన్ష్ హెడ్జ్ 1, ప్రిన్స్ యాదవ్ 6 పరుగులు(నాటౌట్), అర్ష్‌దీప్ సింగ్ 4 (నాటౌట్) పరుగులు చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో జై మూంద్రా, మ్యాట్ హొల్లార్డ్ చెరో మూడు వికెట్లు తీసి భారత్ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు. మాథ్యూ హంఫ్రీస్, హ్యారీ టెక్టర్ చెరో వికెట్ సాధించారు.
బౌలింగ్‌లో రాణించిన టీమిండియా
భారత బౌలర్లు ఐర్లాండ్ భారీ స్కోరు సాధించకుండా నిలువరించారు. ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 22 పరుగులకే 3 వికెట్లు తీశాడు. అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు, హర్షిత్ రానా ఒక వికెట్ సాధించారు. ఐర్లాండ్ బ్యాటర్లలో హ్యారీ టెక్టర్ (53) హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకోగా.. బెంజమిన్ కలిటిస్ 37 పరుగులు తీశాడు.
వైభవ్‌కు దక్కని చాన్స్
ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన వండర్‌కిడ్ వైభవ్ సూర్యవంశీకి తొలి మ్యాచ్‌లో లాగే ఈ మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం దక్కలేదు. టీమిండియా మేనేజ్‌మెంట్ సూర్యాన్ష్ హెడ్డ్జ్, ప్రిన్స్ యాదవ్‌లకు అరంగేట్రం చేసే అవకాశం కల్పించింది. వైభవ్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ లాంటి విశ్లేషకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెనర్‌గా వైభవ్‌ను ఆడించి ఉండాల్సిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది.
