రూ.13వేల కోట్లతో హ్యామ్‌‌ రోడ్లు.. తెలంగాణ అభివృద్ధికి మరో మైలురాయి

రూ.13వేల కోట్లతో హ్యామ్‌‌ రోడ్లు.. తెలంగాణ అభివృద్ధికి మరో మైలురాయి
  • గత బీఆర్‌‌‌‌ఎస్​ సర్కారు హయాంలో రోడ్లను పట్టించుకోలే: మంత్రి కోమటిరెడ్డి
  • హ్యామ్​రోడ్ల టెండర్​ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని వెల్లడి 

హైదరాబాద్/నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో రూ.13 వేల 6 కోట్లతో 441 హ్యామ్ రోడ్లకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర అభివృద్ధికి మరో మైలురాయిలాంటిదని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నదని చెప్పారు. ఆదివారం నల్గొండ జిల్లా కనగల్ మండల కేంద్రంలోని మార్కెట్ యార్డు సమీపంలో నల్గొండ–దేవరకొండ రహదారిపై హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (హ్యామ్​) రహదారుల విస్తరణ, బలోపేతం పనులకు సంబంధించిన శంకుస్థాపన పైలాన్‌ను సీఎం రేవంత్​రెడ్డితో కలిసి వెంకట్‌రెడ్డి ఆవిష్కరించారు.  

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసి.. ఇప్పటికే దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేశామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదలకు రూ.5 లక్షల ఆర్థిక సహాయంతో గౌరవప్రదమైన గృహాలు నిర్మించే కార్యక్రమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. రేషన్ కార్డులజారీతోపాటు సన్నబియ్యం పంపిణీ, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఉద్యోగులకు బీమాలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్నదని చెప్పారు.

బీఆర్‌‌ఎస్‌ పాలనలో రోడ్లు నిర్లక్ష్యం

గత బీఆర్ఎస్​ సర్కారు పదేండ్ల పాలనలో రోడ్ల నిర్వహణ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.  ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర నిధులతోనే రూ. 6 వేల500 కోట్ల విలువైన రోడ్ల పనులను ఇదివరకే చేపట్టిందని తెలిపారు. ఇప్పుడు మరో రూ.13 వేల కోట్లతో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ద్వారా రాష్ట్రంలో రోడ్డు రవాణా వ్యవస్థకు కొత్త దిశ లభిస్తుందని చెప్పారు.

 ప్రతి మండల కేంద్రాన్ని జిల్లా కేంద్రాలతో డబుల్ రోడ్ల ద్వారా అనుసంధానం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, మెరుగైన రహదారులు పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల పెరుగుదలకు, భద్రమైన ప్రయాణానికి దోహదపడతాయని పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులతో కలిపి దాదాపు రూ.78 వేల కోట్ల విలువైన రహదారి అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

హైదరాబాద్–విజయవాడ సిక్స్ లేన్ జాతీయ రహదారి, కనగల్–గుర్రంపోడు మీదుగా బందరు వరకు గ్రీన్‌ఫీల్డ్ హైవే, భవిష్యత్తు బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించిన డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని వివరించారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.

పబ్లిక్‌ డొమైన్‌లో హ్యామ్‌ రోడ్ల టెండర్‌‌ వివరాలు..

హ్యామ్ రోడ్ల పనులపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్ష నేతలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి  సమాధానమిచ్చారు. టెండర్ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరిగిందని, అన్ని వివరాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పదిహేనేండ్లపాటు నిర్వహణ బాధ్యత కూడా కాంట్రాక్టర్‌కే ఉండేలా ఒప్పందాలు కుదిరాయని చెప్పారు. ఎస్సారెస్పీ, ఎస్‌ఎల్‌బీసీలాంటి సాగునీటి ప్రాజెక్టులపై గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్యాన్ని ప్రస్తావించారు.

ప్రస్తుతం ఎస్‌ఎల్‌బీసీ పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగం ద్వారా నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనివల్ల ఫ్లోరైడ్ సమస్య కూడా గణనీయంగా తగ్గుతుందని చెప్పారు. మూసీ నది ప్రక్షాళన కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అత్యంత కీలక కార్యక్రమమని మంత్రి పేర్కొన్నారు.

శుద్ధమైన నీరు అందించడం, ప్రజారోగ్యాన్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యతగా భావించి సీఎం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశ చరిత్రలో శాశ్వత విలువలతో నిలిచిన పార్టీ అని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని  స్పష్టం చేశారు.