హైదరాబాద్, వెలుగు: ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలలో అంతర్జాతీయ దిగ్గజాలను ఒకే వేదికపైకి చేరుస్తూ హైదరాబాద్‌లో ఏరోమార్ట్ సదస్సు జూన్ 30 నుంచి జులై 2 వరకు మూడు రోజుల పాటు ఘనంగా జరగనుంది. ఈ 2వ ఎడిషన్ సదస్సులో 25 దేశాల నుంచి 400కు పైగా కంపెనీలు, 1,200 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
సాధారణ ప్రదర్శనల లాగా కాకుండా, ఏరోమార్ట్ హైదరాబాద్ పూర్తిగా వ్యాపార భాగస్వామ్యాల కోసం డిజైన్ చేశారు. ఇక్కడ ఫారిన్ ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరర్స్, స్థానిక విడిభాగాల సరఫరాదారులు నేరుగా ఒకరినొకరు కలిసి వన్-టు-వన్ సమావేశాలు జరుపుకుంటారు. ఈ 3 రోజుల సదస్సులో గ్రీన్ ఏవియేషన్, డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి అత్యాధునిక అంశాలపై ప్రత్యేక వర్క్‌షాప్‌లు కూడా జరగనున్నాయి.
అడ్వాన్స్‌డ్ బిజినెస్ ఈవెంట్స్ (ఏబీఈ), బీసీఐ ఏరోస్పేస్ సంస్థలు తెలంగాణ ప్రభుత్వం (టీజీఐఐసీ) సహకారంతో ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "ఆత్మనిర్భర్ భారత్" స్ఫూర్తితో దేశీయ చిన్న, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్‌ఎంఈలను) గ్లోబల్ సప్లయ్ చెయిన్‌లో భాగమయ్యేలా చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం.
