ఎలాన్ మస్క్ తర్వాత అతడేనా..? రెండో ట్రిలియనీర్‌పై జోరుగా బెట్టింగులు..!

ఎలాన్ మస్క్ తర్వాత అతడేనా..? రెండో ట్రిలియనీర్‌పై జోరుగా బెట్టింగులు..!

న్యూఢిల్లీ:  ప్రపంచపు రెండో ట్రిలియనీర్ అయ్యే అత్యధిక అవకాశం మెటా సీఈఓ మార్క్ జుకర్‌‌బర్గ్‌‌కే ఉందని ప్రిడిక్షన్ మార్కెట్ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. స్పేస్‌‌ ఎక్స్‌‌ప్లొరేషన్ కంపెనీ స్పేస్‌‌ఎక్స్  ఐపీఓ విజయవంతం కావడంతో ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్‌‌‌‌గా ఎలాన్ మస్క్‌‌ (1.1 ట్రిలియన్ డాలర్లు) సరికొత్త చరిత్ర సృష్టించారు.  అంచనాలపై బెట్టింగ్ చేసే ప్లాట్‌‌ఫారమ్ 'కాల్షి'లోని ట్రేడర్ల లెక్కల ప్రకారం ఈ రేసులో మార్క్ జుకర్‌‌బర్గ్ (మెటా సీఈఓ) మొదటి ప్లేస్‌‌లో ఉన్నారు.   

ట్రిలియనీర్ క్లబ్‌‌లో చేరడానికి ఈయనకు అత్యధికంగా 32శాతం అవకాశం ఉందని ట్రేడర్లు బెట్టింగ్ కాస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఆస్తి సుమారు 200 బిలియన్ డాలర్లు కాగా, ట్రిలియన్ మార్క్‌‌ను తాకడానికి ఇది 5 రెట్లు పెరగాల్సి ఉంటుంది. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌‌కు 21శాతం అవకాశం ఉంది. ఈయన ప్రస్తుత ఆస్తి 180 బిలియన్ డాలర్లు. 

ఏఐ విప్లవంతో జెన్సన్ సంపద  దూసుకుపోతోంది. డెల్ టెక్నాలజీస్ ఫౌండర్  మైఖేల్ డెల్ ప్రస్తుతం జుకర్‌‌బర్గ్, జెన్సన్‌‌ల కంటే ఎక్కువ ఆస్తి (240 బిలియన్ డాలర్లు) కలిగి ఉన్నప్పటికీ, ఈయనకు కేవలం 6శాతం మాత్రమే అవకాశం ఉందని ప్రిడిక్షన్ మార్కెట్ ట్రేడర్లు చెబుతున్నారు. వీరు ప్రస్తుత సంపద కంటే కూడా భవిష్యత్తులో మెటా కంపెనీకి ఉన్న  ఏఐ వ్యాపార వృద్ధి అవకాశాలను  బట్టే జుకర్‌‌బర్గ్‌‌కు ఈ అగ్రస్థానాన్ని కట్టబెట్టారు.