టాటా నుంచి 4 కొత్త ఈవీ మోడల్స్‌‌.. 2030-31 నాటికి తెచ్చే ప్లాన్‌‌

టాటా నుంచి 4 కొత్త ఈవీ మోడల్స్‌‌.. 2030-31 నాటికి తెచ్చే ప్లాన్‌‌

న్యూఢిల్లీ: టాటా మోటార్స్ 2030–-31 ఆర్థిక సంవత్సరం నాటికి 4 కొత్త ఈవీ మోడల్స్‌‌ను, ప్రస్తుతం ఉన్న మోడల్స్‌‌లో 10కి పైగా అప్‌‌గ్రేడెడ్  వెర్షన్లను లాంచ్ చేయనున్నట్లు ఇన్వెస్టర్ల ప్రెజెంటేషన్‌‌లో వెల్లడించింది. తన మొత్తం అమ్మకాలలో ఈవీల వాటాను 30 శాతానికి పైగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కంపెనీ  ఎక్స్‌‌ప్రెస్-టి, కర్వ్, హారియర్, నెక్సాన్, పంచ్, టియాగో ఈవీలను మార్కెట్‌‌లోకి తెచ్చింది.  భవిష్యత్తులో సియెర్రా ఈవీ , అవిన్యా  కాన్సెప్ట్ ఆధారిత మోడల్ సహా మరో రెండు కొత్త మోడల్స్‌‌ను తీసుకురానుంది. 

దీంతో మొత్తం ఈవీల మోడల్స్‌‌ సంఖ్య10కి చేరుతుంది. మరోవైపు  కంపెనీ తన 3వ తరం  బ్యాటరీ టెక్నాలజీపై పనిచేస్తోంది. 75 కిలోవాట్‌‌అవర్‌‌‌‌ కంటే ఎక్కువ సామర్థ్యం గల ఈ బ్యాటరీల ద్వారా ప్రస్తుత కార్ల కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ రేంజ్ (మైలేజ్) లభిస్తుంది.  ప్రస్తుతం ఉన్న వేగం కంటే 3 రెట్లు వేగంగా ఛార్జింగ్ అయ్యే టెక్నాలజీని కంపెనీ  అందుబాటులోకి తేనుంది.