చివరి ఉద్యమకారుడికీ న్యాయం చేస్తాం :  మంత్రి జూపల్లి  కృష్ణారావు

చివరి ఉద్యమకారుడికీ న్యాయం చేస్తాం :  మంత్రి  జూపల్లి  కృష్ణారావు
  • తెలంగాణ ఉద్యమకారుల -ఆత్మగౌరవ సమ్మేళనంలో జూపల్లి  కృష్ణారావు
  • కేసీఆర్ పాలనలో  అవినీతి ఆకాశాన్ని తాకిందని మంత్రి కామెంట్

ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న చివరి ఉద్యమకారుడిని సైతం గుర్తించి న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకోసం తన సంపూర్ణ సహకారం ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ధర్నాచౌక్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సమ్మేళనం జరిగింది.

ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత కేసీఆర్ తానే ఏకైక ఉద్యమకారుడినని భావించారని విమర్శించారు. ప్రాణాలు కోల్పోయిన అమరవీరులను, పోరాడిన ఉద్యమకారులను విస్మరించి, తన కూతురు ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అవినీతి ఆకాశాన్ని తాకగా, ప్రజాస్వామ్యం పాతాళానికి అణచివేయబడిందని మండిపడ్డారు. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ హయాంలో ఉద్యమకారులకు, ఎమ్మెల్యేలకు, చివరకు హోంమంత్రికి కూడా కేసీఆర్ అపాయింట్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇవ్వకుండా అవమానించారని.. అందుకే ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు అధికారం కట్టబెట్టారని వివరించారు.

బడా కాంట్రాక్టర్లకే దోచిపెట్టారు..

తెలంగాణ సిద్ధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ప్రభుత్వం.. స్థానిక ఉద్యమకారులను పక్కనబెట్టి, ఆంధ్రకు చెందిన బడా కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల రూపాయల కాంట్రాక్టులను కట్టబెట్టిందని జూపల్లి ఆరోపించారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో వందల ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయని, వాటిని స్వాధీనం చేసుకుని ఉద్యమకారులకు పంచాలని సూచించారు. ఉద్యమకారుల కమిటీ ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు.

ఉద్యమకారుల న్యాయమైన డిమాండ్లయిన 250 గజాల ఇంటి స్థలం, ఉద్యమకారులకు పెన్షన్ ఇవ్వాలనే మొదలైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ కమిటీలో ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఉద్యమకారుల కమిటీ సభ్యులు మోతే శోభన్ రెడ్డి తదితరులు ప్రసంగించారు.