లుసర్నే: వరల్డ్ రోయింగ్ కప్–-3లో భారత రోయర్లు చరిత్ర సృష్టించారు. తొలిసారిగా గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుని దేశ కీర్తిపతాకాన్ని అంతర్జాతీయ వేదికపై ఎగురవేశారు. స్విట్జర్లాండ్‌లోని లుసర్నే వేదికగా జరిగిన ‘లైట్‌వెయిట్ మెన్స్ డబుల్ స్కల్స్’ ఈవెంట్‌లో ఇండియన్ ఆర్మీకి చెందిన లక్షయ్, ఉజ్వల్ కుమార్ సింగ్ జోడీ అద్భుత ప్రదర్శనతో గోల్డ్ మెడల్‌ను సాధించింది.
అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ రేసులో భారత జోడీ నిర్ణీత దూరాన్ని కేవలం 6: 26.09 నిమిషాల్లో రేసును పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచింది. హాంకాంగ్ 6:27.14 నిమిషాలు సిల్వర్ మెడల్, నెదర్లాండ్స్ 6:27.36 బ్రాంజ్ మెడల్‌తో సరిపెట్టుకుంది. ఈ టోర్నీకి ముందు భారత జట్టుకు వీసా ఆలస్యం కావడంతో బల్గేరియాలో జరిగిన రోయింగ్ కప్–-2కు దూరమవ్వాల్సి వచ్చింది.
కనీస రేసింగ్ ప్రాక్టీస్ కూడా లేకపోయినప్పటికీ, తమ తొలి రేసులోనే లక్షయ్, -ఉజ్వల్ జోడీ ఈ అద్భుత విజయాన్ని సాధించింది. రాబోయే ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని పుణెలోని ‘ఆర్మీ రోయింగ్ నోడ్’లో కఠిన శిక్షణ పొందిన ఈ ఇద్దరు జవాన్లు భారత్‌కు గోల్డ్ మెడల్‌ను తెచ్చిపెట్టారు.
