మేడ్ ఇన్ ఇండియా చిప్స్ వస్తున్నాయి.. 2026లో వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన 4 మెగా ప్లాంట్లు

మేడ్ ఇన్ ఇండియా చిప్స్ వస్తున్నాయి.. 2026లో వాణిజ్య ఉత్పత్తికి సిద్ధమైన 4 మెగా ప్లాంట్లు
  • చిప్ తయారీలో భారత్ ముందుకు
  • సెమీకండక్టర్ మిషన్‌‌తో 
  • రూ.1.64 లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు
  • చిప్, ఏఐ రంగాలపై ప్రభుత్వం ఫోకస్‌‌
  • యూఎస్‌‌ లేటెస్ట్ ఏఐ టెక్‌‌ పొందే ప్రయత్నం

న్యూఢిల్లీ: ఒకప్పుడు కేవలం కలగా ఉన్న చిప్‌‌ల తయారీ నేడు నిజమవుతోంది. మైక్రాన్‌‌, టాటా (అస్సాం), సీజీ పవర్, కైన్స్ కంపెనీల చిప్‌‌ టెస్టింగ్ ప్లాంట్లు  ప్రారంభానికి రెడీగా ఉన్నాయి. తైవాన్ కంపెనీతో టాటా గ్రూప్ గుజరాత్‌‌లో ఏర్పాటు చేస్తున్న సెమీకండక్టర్ తయారీ ప్లాంట్ పనులు ఇప్పటికే 50 శాతం పూర్తయ్యాయి. కొత్త ప్రాజెక్టులు కూడా ఆమోదం పొందాయి.  

సెమీకండక్టర్ మిషన్‌‌తో పెద్ద మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయి. ఇప్పటివరకు  12 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్రం,  వీటి పెట్టుబడుల విలువ రూ.1.64 లక్షల కోట్లకు చేరిందని తాజాగా ప్రకటించింది.  ఇందులో  1 సెమీకండక్టర్ ఫాబ్రికేషన్ (ఫ్యాబ్‌‌) యూనిట్, 2 కాంపౌండ్ సెమీకండక్టర్ ఫ్యాబ్‌‌లు, 9 టెస్టింగ్,  ప్యాకేజింగ్ ప్లాంట్లు ఉన్నాయని పేర్కొంది.    

ఏఐకి అండ

మరోవైపు ఏఐని కూడా విస్తరించే పనిలో ప్రభుత్వం ఉంది. రూ. 10,372 కోట్ల కేటాయింపులతో 'ఇండియాఏఐ'  మిషన్ దూసుకుపోతోంది.  దేశీయంగా బలమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థను నిర్మించడానికి 45 వేల కంటే ఎక్కువ జీపీయూల  సాయంతో భారీ కంప్యూట్   ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను ప్రభుత్వం  సిద్ధం చేస్తోంది.  

ఇది  ఏఐ పరిశోధనలకు వెన్నెముకగా నిలుస్తోంది. సర్వం,  ఏఐ కోష్  వంటి అప్లికేషన్లను దీనిపై ఆధారపడి  పుట్టుకొచ్చాయి.   కేవలం చిప్‌‌ల కొనుగోలుదారుగా కాకుండా, గ్లోబల్ సప్లయ్ చెయిన్‌‌లో ఇండియాను ఒక నమ్మకమైన ప్రొడక్షన్ హబ్‌‌గా  మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని డిజిటల్ ఇండియా కార్యక్రమం 11 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్,  ఐటీ మంత్రిత్వ శాఖ (మైటీ)  వెల్లడించింది. 

అమెరికాతో భాగస్వామ్యం

మరోవైపు  అమెరికా నుంచి లేటెస్ట్ ఏఐ టెక్నాలజీని పొందేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం టెక్నాలజీస్,  క్రిటికల్ మినరల్స్ రంగాల్లో భారత్-–అమెరికా దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పెరిగింది. మైటీ సెక్రటరీ ఎస్ క్రిష్ణన్, విదేశాంగ శాఖ అడిషనల్ సెక్రటరీ కె. నాగరాజ్ నాయుడు మాట్లాడుతూ, ఈ ఒప్పందాలు కేవలం సిద్ధాంతాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష 'ప్రాజెక్టులు'గా మారుతున్నాయని, ఇందులో ప్రైవేట్ రంగానిదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు.   

డిజిటల్ ఇండియా సక్సెస్‌‌

 డిజిటల్ ఇండియా కార్యక్రమం అమల్లోకి వచ్చి 11 ఏళ్లు అవుతోం ది. ఇది దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ఈ కార్యక్రమం సాయంతో  దేశంలో బ్రాడ్‌‌బ్యాండ్ వినియోగదారులు 106.58 కోట్లకు చేరారు. భారత్‌‌నెట్ ద్వారా 2.18 లక్షల గ్రామ పంచాయతీ లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందింది. 99.9శాతం జిల్లా ల్లో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

 ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ పరిశ్రమ రూ. 13 లక్షల కోట్ల స్థాయికి చేరి, భారతదేశం లో 3వ అతిపెద్ద ఎగుమతి రంగంగా నిలిచింది. భారత్ మొబైల్ తయారీలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. ఆర్థిక సంవత్స రం 2025–26లో దేశంలో రికార్డు స్థాయిలో 55,200 కొత్త స్టార్ట ప్‌‌లు నమోదయ్యాయి. వీటి ద్వారా 23.36 లక్షల మందికి ఉపాధి లభించింది, 48 శాతం స్టార్టప్‌‌లలో మహిళా డైరెక్టర్లు ఉన్నారు.

యూపీలో ఊపందుకున్న ఎలక్ట్రానిక్స్ తయారీ

 ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ కలిసి నోయిడా సమీపంలోని జెవార్‌‌‌‌‌‌‌‌లో రూ. 6,750 కోట్ల విలువైన ఎలక్ట్రానిక్స్ తయారీ ప్రాజెక్టులకు తాజాగా శంకుస్థాపన చేశారు.  హార్డ్‌‌‌‌వేర్ ఇండస్ట్రీలో అత్యంత కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ (పీసీబీల) కోసం భారత్ ఏటా దాదాపు రూ. 40 వేల కోట్ల దిగుమతులపై ఆధారపడుతుండగా, ఈ ప్రాజెక్టులు అమల్లోకి వస్తే లోకల్‌‌‌‌గానే ప్రొడక్షన్ పెరుగుతుంది.  

ఇండియా ఎలక్ట్రానిక్స్ తయారీలో  ఫారిన్ కంపెనీలు భాగం అవుతున్నాయి. కొరియాకు చెందిన కేసీసీ భాగస్వామ్యంతో అసెంట్-కె సర్క్యూట్ సంస్థ రూ. 3,250 కోట్లతో మల్టీ-లేయర్ పీసీబీ ప్లాంట్‌‌‌‌ను, అంబర్ ఎంటర్‌‌‌‌ప్రైజెస్ రూ. 3,500 కోట్లతో పీసీబీ అసెంబ్లీ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో  3 వేల మందికి ఉపాధి లభిస్తుంది. అంతేకాకుండా  జెవార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌‌‌‌పోర్ట్, బుల్లెట్ ట్రైన్ కారిడార్‌‌‌‌‌‌‌‌కు దగ్గర ఉన్న  ఈ ప్రాజెక్టులు డెవలప్ అవుతుండడంతో, ఈ ఏరియా  ఎలక్ట్రానిక్స్ హబ్‌‌‌‌గా మారనుంది.