- ఎవరి కులం ఎంతో వారికంత చట్టసభల్లో వాటా దక్కాలని డిమాండ్
- హైదరాబాద్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ తొలి వార్షికోత్సవ సభ
హైదరాబాద్ సిటీ, వెలుగు: బలహీనవర్గాల ఆత్మగౌరవ రక్షణ, చట్టసభల్లో జనాభా నిష్పత్తి ప్రకారం రాజ్యాధికారం సాధించడమే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఉద్యమిస్తుందని ఆ జేఏసీ చైర్మన్, ధర్మ స్వరాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ అన్నారు. తెలంగాణ గడ్డపై జేఏసీ పుట్టిన15 నెలల్లోనే కాంగ్రెస్ సర్కార్‌పై అనేక పోరాటాలు చేసిందన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మొదటి వార్షికోత్సవం ఆదివారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది. దీనికి విశారదన్మహారాజ్తో పాటు జస్టిస్ఈశ్వరయ్య, ఎంపీ ఆర్కృష్ణయ్య, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, మాజీ ఎమ్మెల్యే బండి పుల్లయ్య, తెలంగాణ విఠల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశారదన్ మాట్లాడుతూ.. నాగర్ కర్నూల్‌లోని నాదర్ గుల్ భూములను ఆక్రమిస్తుంటే, రాజ్యాంగం పట్టుకున్న చేత్తో కర్ర పట్టి పోరాడాల్సి వచ్చిందన్నారు.
మాదిగలకు, బీసీలకు కేటాయించిన వందల ఎకరాల భూమిని ఒక ప్రైవేట్ పరిశ్రమ యాజమాన్యం ఆక్రమించిందన్నారు. పోలీసులు మాత్రం బాధితులనే అరెస్టు చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఆక్రమించిన భూమి చుట్టూ 12 నుంచి 15 అడుగుల గోడ కట్టి, అందులో వందలాది రౌడీలను కాపలా పెట్టారన్నారు. ఆ భూయజమానికి రక్షణగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.
ఖమ్మం వెలుగుమట్ల భూమిని రక్షించడానికి కూడా జేఏసీ పోరాటం చేసిందన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఇళ్లను కూల్చేస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. భూదాన్ భూమిలో ఇళ్లు కట్టుకోవడం నేరమని బాధితులను క్రిమినల్స్‌గా కలెక్టర్ ముద్ర వేశారని, కానీ, జేఏసీ పోరాటం వల్ల కలెక్టరే 350 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సి వచ్చిందన్నారు.
భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా పోరాడతాం..
సీఎం రేవంత్ రెడ్డి కాడ్లాపూర్ సర్పంచ్ ఆధ్వర్యంలో 1,450 ఎకరాల భూసేకరణ మొదలుపెట్టారని.. ఇందులో సగం మాదిగల, గొల్లల భూములు ఉన్నాయని విశారదన్ అన్నారు. పరిశ్రమల పేరుతో భూములు లాక్కోవాలని చూశారని.. జేఏసీ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో10 గంటల పాటు యుద్ధం చేసి భూసేకరణను ఆపించామన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు వచ్చే వరకు యుద్ధం ఆగదని, రెడ్లను, వెలమలను తరిమికొట్టాలన్నారు.
కమ్మ రాజ్యానికి ప్రతినిధులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, తుమ్మల ఉన్నారన్నారు. జేఏసీ తెలంగాణ గడ్డపై ‘స్వరాజ్య పాదయాత్ర’ పేరిట 10 వేల కిలోమీటర్ల ప్రపంచ రికార్డు పాదయాత్ర చేపట్టినట్లు విశారదన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో భూస్వామ్య కుటుంబాలు రేవంత్ రెడ్డికి రూ.1,500 కోట్లు ఇచ్చి అధికారంలోకి తీసుకొచ్చాయని ఆరోపించారు.
తెలంగాణలో 14 సంస్థానాలు ఉంటే, అందులో 12 సంస్థానాలు రెడ్డిలవి కాగా ఒకటి వెలమ దొరలదన్నారు. రైతులను, పేదలను హింసించిన భూస్వామ్య వర్గాలకు వ్యతిరేకంగా జేఏసీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందన్నారు. ఓట్లతో ఎవరి కులం ఎంతో వారికంత చట్టసభల్లో వాటా రావాలని లేకపోతే అగ్రవర్ణాల వారిని గోల్కొండ కోటకు ఉరి తీస్తామన్నారు. హైదరాబాద్‌లో త్వరలోనే బహిరంగ సభ పెడతామని చెప్పారు.
పేదల ఇండ్ల కూల్చివేత సరికాదు: జస్టిస్ఈశ్వరయ్య
బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. భూభారతి పోర్టల్, ధరణి సమస్యలతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పేదల ఇళ్ల కూల్చివేతపై సరైనది కాదని, కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కుల వ్యవస్థ ఉండకూడదని, అలా అయితేనే అభివృద్ధి చెందుతామన్నారు. ధర్మ సమాజ్ పార్టీకి మంచి భవిష్యత్ ఉందన్నారు.
ఐఏఎస్నియామకాల్లోనూ వివక్ష: మాజీ డీజీపీ పూర్ణచందర్రావు
తెలంగాణలో ఐఏఎస్ నియామకాల్లో సైతం కుల వివక్ష నడుస్తోందని రిటైర్డ్ఐపీఎస్పూర్ణచందర్ రావు ఆరోపించారు. ఒకే కులానికి చెందిన వారైతే ప్రాంతీయ, మతపరమైన సరిహద్దులు ఉండవా? అని ప్రశ్నించారు. ఎగువ కులాలు మతం మారినా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎలా వర్తిస్తాయని ప్రశ్నించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇప్పటివరకు155 బీసీ కులాలకు అసలు స్థానమే దక్కలేదన్నారు. రాష్ట్ర జనాభాలో 23 శాతం ఉన్న 155 బీసీ కులాల నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకపోవడం దారుణమన్నారు.
రాష్ట్రంలో కేవలం15 బీసీ కులాలకు మాత్రమే అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కిందన్నారు. జనాభాలో కేవలం 4 శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గం నుంచి ఏకంగా 43 మంది ఎమ్మెల్యేలు ఎలా అవుతారని ప్రశ్నించారు. ఎస్టీలకు12, ఎస్సీలకు19, బీసీలకు కేవలం 19 సీట్లు మాత్రమే దక్కాయన్నారు. ముదిరాజ్ కులంలో ఇప్పటివరకు 19 మందే ఎమ్మెల్యేలు అయితే, ఒకే వర్గం నుంచి 576 మంది ఎలా అయ్యారన్నారు.
దేశంలో, రాష్ట్రంలో అసలైన సమస్య నార్త్-–సౌత్ లేదా హిందూ-–ముస్లిం కాదు.. కేవలం కులమేనని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే అడ్డుకున్నది పాలక వర్గాల హిందువులే అని చెప్పారు. రాజకీయాల్లో గెలవడానికి డబ్బు కాదని, బలమైన భావజాలం ముఖ్యమని ఎన్టీఆర్, కేసీఆర్, విజయ్ లాంటి వారే దీనికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
వెలమ దొరల చేతిలో రాష్ట్రం: తెలంగాణ విఠల్
ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో 80 ఏండ్లుగా మూడు కులాలకు చెందిన వారు మాత్రమే సీఎంలుగా ఉన్నారని, 50 ఏండ్లు రెడ్లు, 30 ఏండ్లు కమ్మ దొరలు పాలించారని తెలంగాణ విఠల్ అన్నారు. ‘‘మనం మన కోసం పనిచేస్తే లీడర్ అవుతాం. అదే అగ్రకులాల కోసం పని చేస్తే లేబర్‌లాగా మిగిలిపోతాం. కాబట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీలు లీడర్లుగా మారాలి” అని ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో ఒక్క జడ్జి కూడా వెనకబడిన వర్గానికి చెందినవారు వారు లేరన్నారు.
