హైదరాబాద్, వెలుగు: ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సోమవారం నిర్వహించనున్న16వ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ (సీసీహెచ్ఎఫ్ డబ్ల్యూ) అత్యున్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ హాజరుకానున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ప్రజారోగ్య సేవల బలోపేతం, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలు, కేంద్ర, -రాష్ట్రాల మధ్య సమన్వయం, ఆరోగ్య రంగంలో తీసుకురావాల్సిన కీలక సంస్కరణలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు.
ఈ సమావేశం సందర్భంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద ఆరోగ్య సేతు 2.0, ఆయుష్మాన్ యాప్, డ్రగ్ రిజిస్ట్రీ, యూనిఫైడ్ హెల్త్ ఇంటర్‌ఫేస్ (యూహెచ్ఐ) వంటి అత్యాధునిక డిజిటల్ హెల్త్ సేవలను ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, నిధుల కేటాయింపులు, రాష్ట్రంలో వైద్య మౌలిక సదుపాయాల కల్పనపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రస్తావించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి వరకు సాగే ఈ కీలక సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు పాల్గొని, ప్రజారోగ్య రక్షణే ధ్యేయంగా భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నారు.
