- రంగారెడ్డి జిల్లాలో 99 శాతం మందికి పూర్తి
- నేడు, రేపు ఇంటింటికీ వెళ్లి
- చుక్కల మందు వేయనున్న సిబ్బంది
- గ్రేటర్లో జులై 1 వరకు కొనసాగనున్న కార్యక్రమం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమానికి అనుహ్య స్పందన లభించింది. తొలి రోజు రాష్ట్రవ్యాప్తంగా 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్రంలో మొత్తం 40,97,749 మంది చిన్నారులు ఉంటారని అధికారులు అంచనా వేయగా, మొదటి రోజే 95.1 శాతం మందికి పోలియో చుక్కలు వేయడం విశేషం. రంగారెడ్డి జిల్లాలో 99 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేయడంతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 98.9 శాతంతో రెండో స్థానంలో నిలువగా, మెదక్ జిల్లా 98.6 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. ములుగు, వనపర్తి జిల్లాలు 98.2 శాతం చొప్పున, జయశంకర్ భూపాలపల్లి 98.1 శాతం కవరేజ్‌తో ముందంజలో ఉన్నాయి. ఇక హైదరాబాద్ జిల్లాలో 93.1 శాతం మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
ఆదివారం బూత్ లకు రాలేకపోయిన చిన్నారుల కోసం ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. సోమ, మంగళవారాల్లో వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు. గ్రేటర్ పరిధిలో జులై 1న కూడా పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు.
బోరబండలో కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి
జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ యూపీహెచ్‌సీలో మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కలిసి పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 42 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలనే లక్ష్యంతో వైద్యారోగ్యశాఖ కార్యాచరణను రూపొందించిందన్నారు.
తల్లిదండ్రులు తమ చిన్నారులకు తప్పనిసరిగా రెండు పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తులో వెలుగులు నింపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీతాసత్యనారాయణ, కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు.
