పీవీ ఆర్థిక సంస్కరణల పునాదులపైనే  నేటి సుసంపన్న భారతం : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 

పీవీ ఆర్థిక సంస్కరణల పునాదులపైనే  నేటి సుసంపన్న భారతం : గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా 
  • ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని పిలుపు

రవీంద్రభారతి, వెలుగు: మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు దేశ ఆర్థిక సంస్కరణలకు వేసిన పునాదులపైనే నేటి సుసంపన్న భారతం నిలిచిందని గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. పీవీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లో పీవీ 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన సంస్థలు, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులను గవర్నర్ అభినందించి మెమెంటోలు అందజేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ గడ్డపై పుట్టి దేశ ప్రధానిగా ఎదిగిన పీవీ నరసింహారావు ఈ నేల సంస్కృతి, విలువలను ఎల్లప్పుడూ గౌరవించేవారని తెలిపారు. ఆయన కేవలం రాజకీయ నాయకుడే కాదు.. బహుభాషా కోవిదుడు, రచయిత, దార్శనికుడని కొనియాడారు. దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో పీవీ తీసుకున్న సంస్కరణలే భారత ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశానిర్దేశం చేశాయని, వాటి ఫలితంగానే నేడు దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని తెలిపారు. పీవీ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మురళీమోహన్,పీవీ నరసింహారావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్వీ సుధాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.