- ఫామ్‌హౌస్‌లు, ఖరీదైన వాహనాలతో లగ్జరీ లైఫ్
అయోధ్య: రామాలయ హుండీ విరాళాల చోరీ కేసులో ఒకే కుటుంబానికి చెందిన అనుకల్ప్ మిశ్రా, అతడి బావమరిది లవ్‌కుశ్ మిశ్రాలు ప్రధాన నిందితులుగా తేలారు. భక్తుల కానుకలు లెక్కించే బృందంలో పనిచేస్తున్న వీరిద్దరూ పెద్ద ఎత్తున నిధులు దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కుంభకోణానికి అనుకల్పే సూత్రధారిగా భావిస్తున్నారు. ఇటీవల నిందితుడి సొంత గ్రామమైన బసవాలో పోలీసులు జరిపిన విచారణలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి.
కొంతకాలం కిందటి వరకు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబం.. ఇప్పుడు గ్రామంలోనే అత్యంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తోంది. గతేడాది అయోధ్యలో రూ.65 లక్షల ఇల్లు కొనడమే కాకుండా, గ్రామం వెలుపల ఓ ఫామ్‌హౌస్‌ను కూడా నిర్మించారు. తాజాగా స్కార్పియో కారు బుక్ చేసే పనిలో కూడా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రముఖ ప్రవచనకర్తతో ఏడు రోజుల పాటు గ్రామంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించగా.. దీనికి ఆలయ ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, అయోధ్య మేయర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. మరో నిందితుడు లవ్‌కుశ్ సైతం ఇటీవల లక్ష రూపాయల బైక్ కొన్నట్లు తెలిసింది. ఈ చోరీ సొమ్ము ఎటు మళ్లిందో తేల్చేందుకు 8 మంది నిందితుల ఆర్థిక లావాదేవీలపై పోలీసులు నిఘా పెట్టారు.
