బంగారం కొనడం తగ్గించినందుకు థ్యాంక్స్.. మన్కీ బాత్లో  ప్రధాని  నరేంద్ర మోదీ

బంగారం కొనడం తగ్గించినందుకు థ్యాంక్స్.. మన్కీ బాత్లో  ప్రధాని  నరేంద్ర మోదీ
  • పెళ్లిళ్లకు పాత బంగారంతోనే ఆభరణాలు 
  • చేయించుకున్నారని ప్రశంస
  • కార్‌‌‌‌‌‌‌‌ పూలింగ్‌‌‌‌కు జనం అలవాటు పడ్డారు.. ప్రజా రవాణాను వినియోగించుకుంటున్నారు

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో.. దేశ ప్రయోజనాల దృష్ట్యా తాను చేసిన విజ్ఞప్తులకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గాయని ఆనందం వ్యక్తం చేశారు. పెళ్లిళ్ల సీజన్ అయినప్పటికీ చాలా కుటుంబాలు కొత్త బంగారం కొనకుండా, పాత బంగారాన్నే రీసైకిల్ చేసి ఆభరణాలు చేయించుకున్నాయని ప్రశంసించారు. ఇంధన పొదుపు కోసం ప్రజలు కార్ పూలింగ్ విధానాన్ని అలవర్చుకున్నారని, బస్సులు, మెట్రో రైళ్ల వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు.  ఇంతకాలం సొంతవాహనాల్లో వెళ్లినవారు.. ఇప్పుడు ఇతరులతో కలిసి వెళ్తున్నారని, ఈసారి చాలామంది విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకున్నామని సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. తన విజ్ఞప్తిని మన్నించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఆకాశవాణి ద్వారా ప్రసారమైన  ‘మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్‌‌‌‌’ ద్వారా ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. జూన్ నెలలో దేశం సాధించిన అద్భుత విజయాలను, ప్రజా భాగస్వామ్య శక్తిని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. సముద్ర గర్భం నుంచి ఆకాశం వరకు భారత్‌‌‌‌ మరింత సురక్షితంగా, స్వయంసమృద్ధంగా మారుతోందని స్పష్టం చేశారు. విమానయాన రంగంలో భారత్ జూన్ నెలలో సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు. సీ -295 విమానాన్ని తొలిసారిగా దేశంలోనే తయారుచేసుకున్నట్టు చెప్పారు. ఇలాంటి 40 విమానాలను ప్రస్తుతం స్వదేశీయంగా తయారు చేస్తున్నట్టు  వెల్లడించారు. ఈ చొరవ వల్ల దేశంలోని ఎంఎస్ఎంఈలు, ఏరోస్పేస్ రంగాలకు సరికొత్త ఉత్తేజం లభించడమే కాకుండా, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని, ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పం బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఐఎన్‌‌‌‌ఎస్ దునగిరి, ఐఎన్‌‌‌‌ఎస్ సంశోధక్, ఐఎన్‌‌‌‌ఎస్ అగ్రయ్ యుద్ధనౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవడం గర్వకారణమని పేర్కొన్నారు. ఈ నౌకల డిజైన్ నుంచి తయారీ వరకు ప్రతిదీ స్వదేశీ కావడం విశేషమని పేర్కొన్నారు.  జూన్ 15న ఒడిశా తీరంలో డీఆర్డీఓ విజయవంతంగా పరీక్షించిన ‘లాంగ్-రేంజ్ ల్యాండ్- అటాక్ క్రూయిజ్ మిస్సైల్’  దేశ రక్షణ రంగానికి కొత్త మైలురాయి అని ప్రధాని ప్రశంసించారు.

 మూఢనమ్మకాలతో నష్టమే..

సమాజంలో వేళ్లూనుకున్న మూఢనమ్మకాలు భయాన్ని సృష్టించి తార్కిక ఆలోచనను చంపేస్తాయని ప్రధాని మోదీ తెలిపారు. అస్సాంలో పూర్వం అరిష్టంగా భావించి వేటాడిన అరుదైన ‘హర్గిలా’ పక్షులను జీవశాస్త్రవేత్త పూర్ణిమ దేవి బర్మన్.. శాస్త్రీయ అవగాహనతో మహిళలను ఏకం చేసి ‘హర్గిలా ఆర్మీ’ ద్వారా ఎలా రక్షించారో గుర్తుచేశారు. అలాగే, సాంకేతికత- సంస్కృతిల మేళవింపులో భాగంగా ప్రాచీన ‘శాస్త్రార్థ’ చర్చల సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తున్న నలంద విశ్వవిద్యాలయాన్ని, సంప్రదాయ జ్ఞానాన్ని అధునాతన సాంకేతికతతో ముడిపెడుతూ ఏఐ, డేటా సైన్స్‌‌‌‌లో బీటెక్ కోర్సును ప్రారంభిస్తున్న ఢిల్లీలోని సెంట్రల్ సంస్కృత్ వర్సిటీని అభినందించారు. డొమినికన్ రిపబ్లిక్‌‌‌‌లో కేవలం 100 మంది భారతీయులు ఉన్నప్పటికీ అక్కడి స్థానిక స్పానిష్ ప్రజలు ‘బ్రహ్మకమల్ డొమినికన్’ గ్రూపుగా ఏర్పడి వేద మంత్రాలను స్పష్టంగా పఠిస్తున్నారని, ఇది భారతీయ సాంస్కృతిక వై
భవానికి నిదర్శనమని పేర్కొన్నారు.

ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎకో బ్రిక్స్..

కాలం గడిచేకొద్దీ మరింత బలంగా మారే మేఘాలయలోని సహజసిద్ధ రబ్బరు చెట్ల ‘లివింగ్ రూట్ బ్రిడ్జెస్’ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించేందుకు దరఖాస్తు చేశామని తెలిపారు. మధ్యప్రదేశ్‌‌‌‌లోని రాజ్‌‌‌‌గఢ్ జిల్లా బియావ్‌‌‌‌రాకు చెందిన మహిళలు ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ఎకో బ్రిక్స్‌‌‌‌గా మార్చి ప్రజా స్థలాలను అందంగా తీర్చిదిద్దుతున్న విధానాన్ని ప్రశంసించారు. రైతులు రసాయన రహిత వ్యవసాయాన్ని అవలంబిస్తూ, సహజ ఎరువుల వినియోగాన్ని పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని నాందేడ్‌‌‌‌కు చెందిన పేత్కర్ కుటుంబం సుమారు 3,500 మంది గ్రామస్తులకు ఉచిత ప్రమాద బీమా కల్పించడం అభినందనీయమని తెలిపారు. రాబోయే వినాయక చవితి ఉత్సవాలకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాకుండా స్థానిక కుమ్మరులు తయారు చేసిన మట్టి ప్రతిమలనే కొనుగోలు చేయాలని కోరారు. ‘క్యాచ్ ది రెయిన్’ ఉద్యమం ద్వారా వర్షపు నీటిని సంరక్షించి నీటి కొరతను అధిగమించాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు.