జంతర్ మంతర్ దగ్గర వాంగ్‌‌‌‌చుక్ దీక్ష.. కాక్రోచ్ పార్టీ ఆందోళనకు మద్దతు

జంతర్ మంతర్ దగ్గర వాంగ్‌‌‌‌చుక్ దీక్ష.. కాక్రోచ్ పార్టీ ఆందోళనకు మద్దతు

న్యూఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌‌‌‌ రాజీనామా చేయాలనే డిమాండ్‎తో పోరాడుతున్న కాక్రోచ్‌‌‌‌ జనతా పార్టీ (సీజేపీ)కి లడఖ్ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ మద్దతు ప్రకటించారు. జంతమంతర్‌‌‌‌లో ఆయన నిరాహారదీక్ష ప్రారంభించారు. అంతకుముందు వాంగ్‌‌‌‌చుక్ సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేతో కలిసి రాజ్ ఘాట్‌‌‌‌ను సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. కాగా, వాంగ్‌‌‌‌చుక్ దీక్షకు మద్దతుగా వందలాది మంది యవకులు, విద్యార్థులతో పాటు పలువురు రైతు నాయకులు జంతర్ మంతర్ వద్దకు తరలివచ్చారు. 

ఈ సందర్భంగా సోనమ్ వాంగ్‌‌‌‌ చుక్ మీడియాతో మాట్లాడారు. ‘‘నేను రెండు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ దీక్ష చేస్తున్నాను. గత 40 ఏండ్లుగా విద్య అనేది నా హృదయానికి దగ్గరైన అంశం. నేను ఇంజనీరింగ్ చేసినప్పటికీ ఏ ఉద్యోగంలోనూ చేరలేదు. ఎందుకంటే రాబోయే తరాల భవిష్యత్తుకు విద్యే కీలకమని నేను నమ్మాను. అలాంటి విద్యా వ్యవస్థపై యువత గళం విప్పినప్పుడు నేను ఎలా మౌనంగా ఉండగలను..? అందుకే వారికి నా మద్దతు ప్రకటించాను” అని వాంగ్‌‌‌‌చుక్ పేర్కొన్నారు.