- మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ భూస్వామికి 360 ఎకరాలు
- సీలింగ్ యాక్ట్, నక్సలైట్ల భయంతో భూములు వదిలేసి వెళ్లిపోయిన దొర
- యాభై ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతులు
- దొర వారసులతో రియల్టర్ల ఒప్పందం.. భూములు గుంజుకునేందుకు ప్రయత్నం
బెల్లంపల్లి రూరల్, వెలుగు : ఏండ్ల తరబడి పేదల ఆధీనంలో ఉన్న భూములపై కొందరు రియల్టర్లు కన్నేశారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రికార్డులను ఆసరాగా చేసుకొని, దొరల వారసులతో ఒప్పందం చేసుకున్నామంటూ పేద రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తరచూ భూముల వద్దకు వస్తూ చెట్లను నరికి వేయిస్తుండడం, సర్వే ఆఫీసర్లను తీసుకొచ్చి భయభ్రాంతులకు గురి చేస్తుండడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
యాభై ఏండ్లుగా సాగులో ఉన్నా...
మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని ఆవుడం, చిత్తాపూర్, మామిడిగట్టు, గంగారం గ్రామాల పరిధిలో గతంలో ఓ భూస్వామి కుటుంబానికి 360 ఎకరాలకుపైగా భూములు ఉండేవి. 1955-56 సంవత్సరంలో సీలింగ్ చట్టం అమలు కావడంతో భూములను కుటుంబ సభ్యులకు బదలాయించారు. అయినా ఆ భూములు దొర కుటుంబం ఆధీనంలోనే ఉండడంతో 1977లో మావోయిస్టులు జోక్యం చేసుకున్నారు. సదరు భూములు పేద రైతులకు పంచాలని దొరను హెచ్చరించడమే కాకుండా, భూములను స్వాధీనం చేసుకొని పేదలకు పంచి పెట్టారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా భూస్వామి భూములను వదిలేసి హైదరాబాద్ కు వెళ్లిపోయారు. అప్పటినుంచి రైతులు ఆ భూముల్లో మామిడి తోటలతో పాటు ఇతర పంటలు సాగు చేస్తూ బతుకుతున్నారు.
రియల్టర్లకు వరంగా 'ధరణి'
పట్టాదారుడే హక్కుదారుడంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ధరణి' పోర్టల్ తో రైతుల నెత్తిన పిడుగు పడినట్లైంది. ఈ చట్టం ద్వారా కబ్జాలో ఉన్న రైతులతో సంబంధం లేకుండా పట్టాదారుడు ఒప్పుకుంటే భూ యజమాని హక్కు మారే అవకాశం కలిగింది. ఈ చట్టం కింద నెన్నెల మండలంలోని దొరకు సంబంధించిన భూములు అతడి వారసుల పేరుతోనే పట్టా అయ్యాయి. దీనిని ఆసరాగా చేసుకున్న రియల్టర్లు దొర వారసులను కలిసి ఎంతో కొంత ధర నిర్ణయించుకుంటున్నారు. తర్వాత భూముల వద్దకు వచ్చి.. ఈ భూములను దొర వారసుల నుంచి తాము కొనుగోలు చేశామంటూ రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొందరు వ్యక్తులు 10 నుంచి 15 ఎకరాల వరకు పట్టాలు చేసుకొని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని రైతులు వాపోయారు. రెండు రోజుల కింద కొందరు రియల్టర్లు సర్వే ఆఫీసర్లతో వచ్చి భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రైతులు అడ్డుకోవడంతో వారంతా వెనుదిరిగి వెళ్లిపోయారు. యాభై ఏండ్లుగా ఈ భూములను సాగు చేసుకొని బతుకుతున్నామని, రియల్టర్లు చెల్లించిన విధంగానే తామంతా డబ్బులు ఇస్తామని, భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.
కలెక్టర్ కు ఫిర్యాదు చేశాం
మా తాతల కాలం నుంచి సాగు చేసుకుంటున్న భూముల నుంచి మమ్ములను పంపించేయాలని కుట్ర చేస్తున్నారు. ఈ విషయంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేశాం. రైతులకు అన్యాయం చేయాలని రియల్టర్లు చూడడం సరికాదు.
దుర్గం రవీందర్, ఆవుడం
భూములు లాక్కోవద్దు
ఎన్నో ఏండ్లుగా భూములు సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. రైతుల నుంచి భూములు లాక్కొని జీవనాధారం దెబ్బతీయొద్దు. సంబంధిత భూస్వామితో మాట్లాడుకుంటామని చెబుతున్నప్పటికీ రియల్టర్లు భూముల మీదకు రావడం, సర్వేలు చేపట్టడం సరికాదు. సాగులో ఉన్న రైతులకు అన్యాయం చేస్తే ఆందోళనలు చేపడుతాం.
అర్కాల ఓదెలు, మాజీ సర్పంచ్, ఆవుడం
