వరంగల్లో శిల్పకలావేదిక18 ఏండ్ల తర్వాత ప్రాజెక్టు ముందడుగు..రూ.20 కోట్లు కేటాయించిన 'కుడా'

వరంగల్లో శిల్పకలావేదిక18 ఏండ్ల తర్వాత ప్రాజెక్టు ముందడుగు..రూ.20 కోట్లు కేటాయించిన 'కుడా'
  • పూర్తిస్థాయిలో ఏసీ శిల్పకళా వేదిక ఏర్పాటుకు ప్రతిపాదనలు
  • హనుమకొండ న్యూ శాయంపేట వద్ద నిర్మాణానికి అడుగులు 
  • పదేండ్లు మాటలతో సరిపుచ్చిన బీఆర్ఎస్‍ గవర్నమెంట్

వరంగల్, వెలుగు: ఓరుగల్లులో శిల్పారామం ఏర్పాటుకు 18 ఏండ్ల తర్వాత మళ్లీ అడుగులు పడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​లో వైఎస్. రాజశేఖరరెడ్డి హయాంలో వరంగల్‌‌‌‌కు శిల్పారామం మంజూరైంది. ఆ తర్వాత తెలంగాణ ఏర్పడినా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. స్థలాల ఎంపిక పేరుతో కాలయాపన జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శిల్పారామం నిర్మాణానికి చర్యలు ప్రారంభించింది.

గ్రేటర్ వరంగల్‌‌లోని హనుమకొండ హంటర్ రోడ్, న్యూ శాయంపేట ప్రాంతంలో దీనిని నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన నిధులను కాకతీయ అర్బన్ డెవలప్‌‌మెంట్ అథారిటీ (కుడా) సమకూరుస్తోంది.

2008లోనే అవకాశం.. మధ్యలోనే నిలిచిన ప్రాజెక్టు

2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి కడప, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంతో పాటు హైదరాబాద్ నాగోల్, వరంగల్ జిల్లాలకు శిల్పారామాలను మంజూరు చేశారు. వరంగల్ శిల్పారామం నిర్మాణానికి అవసరమైన అనుమతులు కూడా మంజూరయ్యాయి. మొత్తం రూ.12 కోట్లతో ప్రాజెక్టు ప్రతిపాదించగా, తొలిదశ పనులకు రూ.5 కోట్లు కేటాయించారు. అయితే, వైఎస్.రాజశేఖరరెడ్డి మరణం, అనంతరం తెలంగాణ ఉద్యమం కారణంగా పనులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అవసరమైన భూమి కేటాయించకపోవడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఫలితంగా వరంగల్ మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో శిల్పారామాలు పూర్తయ్యాయి.

స్థలాల ఎంపికలోనే పదేండ్లు వృథా..

తెలంగాణలో బీఆర్‌‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో శిల్పారామానికి స్థలం ఎంపిక చేయడంలోనే సమయం గడిచిపోయింది. మొదట హనుమకొండ గోపాల్‌‌పూర్‌‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించి, భూసేకరణ ప్రారంభించి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. అనంతరం రాంపూర్, మడికొండ, బాలసముద్రం, హసన్‌‌పర్తి, జక్కలొద్ది, రెడ్డిపురం, హయగ్రీవచారి గ్రౌండ్ వంటి ప్రాంతాలు పరిశీలనలోకి వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఒక దశలో ఖిలా వరంగల్ సమీపంలోని స్థలాన్ని ఎంపిక చేసినప్పటికీ, కేంద్ర పురావస్తు శాఖ అనుమతి ఇవ్వలేదు. తర్వాత వరంగల్-ఖమ్మం రోడ్డులోని బెస్తం చెరువు వద్ద 60 ఎకరాల భూమిని గుర్తించారు.

మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కిషన్‌‌రావు, ఫిల్మ్​ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ఈ స్థలాన్ని అనుకూలంగా సూచించగా, అప్పటి జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ 15 ఎకరాల కేటాయింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయినప్పటికీ పనులు ముందుకు సాగలేదు. 2019లో హనుమకొండ హంటర్ రోడ్‌‌లో 30 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసినట్లు ప్రకటించారు. అదే ఏడాది సెప్టెంబర్ 19న అప్పటి కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, హైదరాబాద్ శిల్పారామం జనరల్ మేనేజర్ హరికిషన్ దాస్ స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే శంకుస్థాపన చేస్తామని ప్రకటించినా, అది ప్రకటనలకే పరిమితమైంది.

ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తాం.. 

గ్రేటర్‍ వరంగల్​లో శిల్పకళా వేదిక నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాం. 18 ఏండ్ల కింద వైఎస్‍ హయాంలో కాంగ్రెస్‍ ప్రభుత్వంలోనే దీనిని మంజూరు చేసినం. రూ.12 కోట్లు ఇచ్చినం. ఆ తర్వాత పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్‍ ప్రభుత్వం దీనిని పట్టించుకోలే. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్‍ ప్రభుత్వంలోనే హైదరాబాద్‍ శిల్పారామానికి ధీటుగా శిల్పకళా వేదికను నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. - ఎమ్మెల్యే నాయిని రాజేందర్​రెడ్డి,  కుడా చైర్మన్‍ వెంకటరమణారెడ్డి ఏసీ కన్వెన్షన్​ సెంటర్​ 

గ్రేటర్ వరంగల్‌‌లో శిల్పారామం నిర్మాణాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కుడా ముందస్తుగా రూ.20 కోట్లు కేటాయించింది. హనుమకొండ హంటర్ రోడ్‌‌లోని కాకతీయ జూపార్క్ సమీపంలోని న్యూ శాయంపేట ప్రాంతంలో దాదాపు 20-30 ఎకరాల్లో శిల్పారామాన్ని నిర్మించేందుకు భూమిని సిద్ధం చేశారు. దీనిని పూర్తిస్థాయి ఏసీ కన్వెన్షన్ సెంటర్, కల్చరల్ హబ్‌‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, కాన్ఫరెన్స్​లు నిర్వహించేలా అత్యాధునిక శిల్పకళా వేదికను నిర్మించనున్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికారులు తెలిపారు.