తిరుపతి: తిరుపతిలోని అలిపిరి - జూపార్క్ రోడ్డులో టీటీడీ (TTD), విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపై ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు పాలనలో టీటీడీని పరిరక్షిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూనే, క్షేత్రస్థాయిలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
స్వామివారి చిత్రపటాల పట్ల అపచారం
అలిపిరి సమీపంలోని కిలోమీటర్ పరిధిలో ఉన్న టీటీడీ వెంకటేశ్వరస్వామి స్థలాల్లో పవిత్రత కరువైందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. దీనికి చంద్రబాబే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కొన్ని వందల, వేల స్వామివారి చిత్రపటాలను అత్యంత నిర్లక్ష్యంగా చెత్తకుప్పల్లో, మలమూత్రాల మధ్య పడేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ చిత్రపటాలు బీరు బాటిళ్లు, వాడేసిన మురికి వస్తువుల మధ్య పడి ఉన్నాయని, వీటిని శుభ్రం చేయాల్సిన బాధ్యత అధికారులకు లేదా అని ప్రశ్నించారు. టీటీడీ స్థలాలు స్వామివారి ఫొటోలు పడేసే డస్ట్ బిన్‌లుగా మారిపోయాయని, ఈ పాలనలో ఎంతటి అపచారాలు జరుగుతున్నాయో ఇది కళ్లకు కట్టినట్లు చూపిస్తోందని అన్నారు.
అధికారులపై ఫైర్.. పవన్ కళ్యాణ్‌కు సవాల్!
ఈ వైఫల్యానికి టీటీడీ విజిలెన్స్ విభాగమే కారణమని భూమన కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు. "గత రెండేళ్లుగా టీటీడీని ప్రక్షాళన చేస్తున్నామని చెప్తున్న టీటీడీ ఈవో, చైర్మన్ బి.ఆర్. నాయుడుతో సహా పాలకులంతా ఈ పరిస్థితిని చూసి సిగ్గుతో తలదించుకోవాలి" అని మండిపడ్డారు.
అలాగే సనాతన ధర్మం, సంప్రదాయాలను కాపాడతామన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. "సనాతన ధర్మాన్ని కాపాడతామన్న పవనానంద స్వామి.. మీ సనాతనం ఎలా ఏడ్చి చచ్చిందో ఓసారి వచ్చి చూడండి. ప్రక్షాళన చేస్తామన్నారు, ఇదేనా ప్రక్షాళన? మీ పాలన అంతా అవినీతిమయంగా మారింది" అంటూ భూమన కరుణాకర్ రెడ్డి సవాల్ విసిరారు.
