నెవ్వెర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్.. ఇలాంటి ఎప్పుడూ జరగలేదు.. భవిష్యత్ లో జరుగుతుందనే నమ్మకం లేదు. ఏపీ రాష్ట్రం నరసరావుపేట పట్టణంలో జరిగిన ఓ వింత ఘటన.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే ఆసక్తికర చర్చగా మారింది. దొంగనే భయపెట్టి.. దొంగకు చెమటలు పట్టించిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
నరసరావుపేట పట్టణంలోని ఓ అపార్ట్ మెంట్ లో దొంగతనం జరిగింది. 2026, జూలై 30వ తేదీన. ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగలు.. ఇంట్లోని 317 గ్రాముల బంగారం, 21 లక్షల రూపాయల డబ్బు ఎత్తుకెళ్లారు. దీనిపై పోలీస్ కంప్లయింట్ ఫైల్ అయ్యింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. 15 రోజులుగా దొంగ దొరక లేదు.
దొంగ అయితే దొరకలేదు కానీ.. ఆ దొంగ దోచుకెళ్లిన డబ్బు మాత్రం ఆ ఇంటి యజమానికి తిరిగి వచ్చింది. ఏంటీ ఆశ్చర్యంగా ఉందా.. అవును.. ఉదయం నిద్ర లేచిన ఇంటి ఓనర్ బయటకు వచ్చాడు. చెప్పుల స్టాండ్ దగ్గర ఓ కవర్ కనిపించింది. తీసి చూస్తే అందులో 19 లక్షల రూపాయల డబ్బు ఉంది. ఆ డబ్బు తన ఇంట్లో దోచుకెళ్లినదే.. దాంతో పాటు ఓ లెటర్ ఉంది. ఆ లెటర్ లో ఇలా రాసి ఉంది. నన్ను క్షమించండి.. నా వాటాగా వచ్చిన 19 లక్షల రూపాయలు తిరిగి ఇచ్చేస్తున్నాను అని ఉంది. ఇంటి ఓనర్ షాక్.. పోయిన డబ్బు వచ్చేసింది అని విషయాన్ని పోలీసులకు చెప్పాడు.. వాళ్లు లెటర్ స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఇంతకీ ఆ దొంగలో మార్పు తీసుకొచ్చింది ఏంటో తెలుసా.. అంజనం.. మంత్రగాడి అంజనం..
మంత్రగాడితో అంజనం వేయించినట్లు ప్రచారం :
ఇంట్లో దొంగతనం జరిగిన తర్వాత.. ఆ ఇంటి వాళ్లు ఓ మంత్రగాడిని కలిశారు. ఆ మంత్రగాడు ఏం చెప్పాడో తెలుసా.. ఈ దొంగతనం చేసింది మీ అపార్ట్ మెంట్ లో ఉండే కొంత మంది కావొచ్చు అని చెప్పాడు. దీని కోసం ఆ మంత్రగాడు అంజనం వేసినట్లు అపార్ట్ మెంట్ లో చెప్పారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా అందరికీ తెలిసింది. దొంగతనంపై అంజనం చేయించారంటా అంటూ ప్రచారం జరిగింది. ఇది దొంగ వరకు చేరినట్లు ఉంది.. భయంతో కొట్టేసిన డబ్బును.. అర్థరాత్రి ఎవరూ చూడకుండా.. ఇంటి గుమ్మం దగ్గర వదిలి వెళ్లాడు.. ఈ విషయం ఇప్పుడు నరసరావుపేటలో హాట్ టాపిక్ అయ్యింది. అంజనం దెబ్బకు దొంగనే భయపడ్డాడు అంటూ చెప్పుకొంటున్నారు.
అంజనం అంటే మంత్ర తంత్ర విద్య. ఓ మంత్రగాడు కాటుకను మంత్రించి.. అరచేతిలో లేదా ఆకుపై రాస్తాడు. అందులో చూస్తూ భవిష్యత్ ను చెప్పటం అన్నమాట. దీన్ని చోరాంజనం అని అంటారు. దొంగలు ఎక్కడ ఉన్నారు లేదా దోచుకున్న సొమ్మును ఎక్కడ దాచారు అనేది కనుక్కోవటానికి పూర్వకాలంలో అంజనం వేసి చెప్పేవాళ్లు. ఇది ప్రాచీన కాలంలో మంత్ర తంత్ర విద్యగా చెబుతుంటారు. అప్పట్లో పోలీసులు, కోర్టులు, సీసీ కెమెరాలు, ఫోరెన్సిక్ ల్యాబ్స్, వేలిముద్రలతో విచారణ ఇలా ఏమీ లేవు కదా.
