వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో వినాయక నిమజ్జన ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బందోబస్తు విధుల్లో ఉన్న నర్సింహులు అనే కానిస్టేబుల్‌పై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. 2026 సెప్టెంబర్ 25 రాత్రి జరిగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు.
ఊరేగింపు సాగుతుండగా రెండు వర్గాల యువకుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు, ఘర్షణను ఆపేందుకు కానిస్టేబుల్ నర్సింహులు అక్కడికి వెళ్లారు. అప్పటికే కత్తితో ఉన్న తరుణ్ అనే యువకుడు ఒక్కసారిగా కానిస్టేబుల్ ఛాతీ భాగంలో బలంగా పొడిచాడు.
తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిన కానిస్టేబుల్‌ను తోటి సిబ్బంది వెంటనే పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఛాతి నుంచి రక్తస్రావం ఆగకపోవడం, పరిస్థితి విషమంగా మారడంతో మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. దాడికి పాల్పడిన తరుణ్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.
