షాద్ నగర్ హోటళ్లలో తింటున్నారా?..చనిపోయిన కోళ్ల మాంసం సప్లై చేస్తున్నారు జాగ్రత్త

షాద్ నగర్ హోటళ్లలో తింటున్నారా?..చనిపోయిన కోళ్ల మాంసం  సప్లై చేస్తున్నారు జాగ్రత్త

షాద్ నగర్ పట్టణంలో కొన్ని హోటల్ నిర్వాహకులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు.  తక్కువ ధరకే వస్తుందనే ఆశతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. చనిపోయిన, అనారోగ్యంతో ఉన్న కోళ్ల మాంసాన్ని హోటళ్లకు సరఫరా చేస్తున్నారు.

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణానికి మహబూబ్ నగర్ నుంచి ఒక ఆటోలో భారీగా చికెన్ తరలిస్తుండగా స్థానిక వ్యాపారులు అడ్డుకున్నారు. అనుమానం వచ్చి ఆటోను తనిఖీ చేయగా... అందులో కుళ్లిన, డ్యామేజ్ అయిన చికెన్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మున్సిపల్ అధికారులకు సమాచారం అందించి, ఆటోను వారికి అప్పగించారు.ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు ఆటోలోని మాంసాన్ని పరిశీలించగా... అది అనారోగ్యంతో చనిపోయిన కోళ్ల మాంసమేనని ప్రాథమికంగా నిర్ధారించారు.

ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ సునీత  తీవ్రంగా స్పందించారు. కుళ్లిన మాంసాన్ని తరలిస్తున్న ఆటోను వెంటనే సీజ్ చేయించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ, ఇలాంటి నిషిద్ధ మాంసాన్ని కొనుగోలు చేస్తున్న హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

తక్కువ ధర వస్తోందని కక్కుర్తి పడి, ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న ఇలాంటి హోటల్ నిర్వాహకులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బయట హోటళ్లలో తినేటప్పుడు ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.