దేశంలో 92% క్రెడిట్ కార్డ్ యూజర్లు చేస్తున్న తప్పు ఇదే.. ఏటా రూ. 2 లక్షలు నష్టపోతున్నరు!

దేశంలో 92% క్రెడిట్ కార్డ్ యూజర్లు చేస్తున్న తప్పు ఇదే.. ఏటా రూ. 2 లక్షలు నష్టపోతున్నరు!

జేబులో క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు.. కిరాణా సామానుల దగ్గర నుంచి ఫ్లైట్ టికెట్ల వరకు అన్నిటికీ దాన్నే వాడేస్తున్నాం. అవును భారతీయులకు ఇప్పుడు క్రెడిట్ కార్డ్ ఒక వ్యసనంగా, అత్యవసరంగా మారిపోయిందట. ఐదేళ్లలో మన దేశంలో క్రెడిట్ కార్డ్ లావాదేవీలు ఏకంగా 3 రెట్లు పెరిగాయి. ట్విస్ట్ ఏంటంటే.. కార్డ్ వాడుతున్న వారిలో 92 శాతం మంది తమకు రావాల్సిన రివార్డులను పూర్తిగా వదిలేస్తుండటమే. అవును ఖర్చుల తీరుకు సరిపోని 'తప్పుడు' కార్డ్‌ను వాడటం వల్ల ఏటా ఏకంగా రూ.2 లక్షల వరకు నష్టపోతున్నారని '1 ఫైనాన్స్ మ్యాగజైన్' సర్వేలో తేలింది.

దేశంలో డిజిటల్ పేమెంట్స్ జోరు ఎలా ఉందో చెప్పడానికి క్రెడిట్ కార్డ్ మార్కెట్ వృద్ధి ఒక ఉదాహరణ. 2020-21 ఆర్థిక సంవత్సరంలో క్రెడిట్ కార్డ్ పేమెంట్ల విలువ రూ. 6.3 లక్షల కోట్లు ఉంటే.. 2024-25 నాటికి అది ఏకంగా రూ. 21.1 లక్షల కోట్లకు చేరింది. లావాదేవీల సంఖ్య కూడా 176.4 కోట్ల నుంచి 477.4 కోట్లకు పెరిగిపోయింది.

అసలు ఎక్కడ తప్పు జరుగుతోంది?
జనం విపరీతంగా ఖర్చు పెడుతున్నారు కానీ.. ఏ కార్డ్‌ను ఎక్కడ వాడాలో తెలియక తప్పు చేస్తున్నారు. ట్రావెల్, డైనింగ్, గ్రోసరీస్, ఆన్‌లైన్ షాపింగ్ లాంటి వేర్వేరు కేటగిరీలకు ఎక్కువ రివార్డులు ఇచ్చే కార్డులు ఉంటాయి. కానీ చాలామంది అన్నిటికీ ఒకే కార్డును వాడేస్తున్నారు. మరికొందరు అవసరం లేకపోయినా ఎక్కువ కార్డులు మెయింటైన్ చేస్తూ.. వాటి మైల్‌స్టోన్ బోనస్‌లను అందుకోలేకపోతున్నారు.

ఎంత ఖర్చుకు ఎంత నష్టం?
ప్రస్తుతం సగటు కార్డ్ హోల్డర్ కేవలం 4 శాతం మాత్రమే వార్షిక పొదుపును రివార్డుల రూపంలో పొందుతున్నాడు. అదే సరైన కార్డ్స్ ఎంచుకుంటే ఈ పొదుపును 10 నుంచి 14 శాతానికి పెంచుకోవచ్చు. మీ వార్షిక ఖర్చును బట్టి మీరు ఎంత నష్టపోతున్నారో ఈ కింద చూడండి:
* రూ. 5 లక్షల లోపు ఖర్చు: ఏటా రూ.20వేల-25వేలు పొందే అవకాశం ఉన్నా.. తప్పుడు కార్డు వల్ల రూ.4వేల-5వేలు నష్టపోతున్నారు.
* రూ. 5-8 లక్షల ఖర్చు: ఏటా దాదాపు రూ.38వేల నుంచి రూ.42వేల వరకు రివార్డులను కోల్పోతున్నారు.
* రూ.8-15 లక్షల ఖర్చు: వీరు ఏకంగా రూ.85వేల-90వేలు విలువైన రివార్డ్స్ వదిలేస్తున్నారు.
* రూ. 15 లక్షల పైన: హై-ఎండ్ స్పెండర్స్ ఏటా రూ.2 లక్షల నుంచి రూ. 2 లక్షల 10వేల వరకు నష్టపోతున్నారు.

స్మార్ట్‌గా సేవ్ చేయడం ఎలా?
రివార్డ్ పాయింట్లను క్యాష్‌బ్యాక్, సాధారణ వస్తువుల కోసం కాకుండా.. ట్రావెల్ బుకింగ్స్, పార్ట్‌నర్ వోచర్స్ కోసం వాడితే 2 నుంచి 5 రెట్లు ఎక్కువ వాల్యూ వస్తుంది. మీ గత 6-12 నెలల ఖర్చులను ఒకసారి రివ్యూ చేసుకోండి. మీ 70 శాతం ఖర్చులకు ఉపయోగపడేలా ఒక ప్రైమరీ కార్డ్, మిగిలిన ఖర్చుల కోసం మరో కాంప్లిమెంటరీ కార్డ్‌ను పెట్టుకోండి. రూపాయి అదనంగా ఖర్చు పెట్టకుండానే వేలల్లో ఆదా చేసుకోండి.