ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్‌లో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగ్రేటం చేయకపోవడం భారత అభిమానులను నిరాశపర్చింది. యూకే పర్యనటకు భారత జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ తుది జట్టుకు మాత్రం ఈ 15 ఏళ్ల చిచ్చర పిడుగు ఎంపిక కాలేదు. ఈ క్రమంలో ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ లెవన్ లో చోటు దక్కకపోవడంపై టీమిండియా సహాయ కోచ్ ర్యాన్ టెన్ డోస్కేట్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
రెండో మ్యాచ్ అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డోస్కేట్ మాట్లాడుతూ.. మిగతా ఆటగాళ్లందరిలాగే వైభవ్ కూడా అవకాశాల కోసం వేచి ఉండాల్సి వస్తుందని తేల్చిచెప్పారు. అతను అంతర్జాతీయ క్రికెట్ ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు.. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అయితే, వైభవ్ కోసం ఉన్నఫలంగా జట్టు నుంచి సీనియర్ ఆటగాళ్లను తప్పించలేమన్నారు.
సంజు శాంసన్‌ను టీమ్ నుంచి తొలగించి వైభవ్‌కు ఛాన్స్ ఇవ్వాలన్న వాదనలపై రియాక్ట్ అవుతూ.. మూడు నెలల క్రితం ఇండియా టీ20 వరల్డ్ కప్‌లో గెలవడంలో శాంసన్ ఎంతో కృషి చేశాడని గుర్తు చేశారు. రెండు మ్యాచుల్లో విఫలమైనంతా మాత్రాన అతడిని జట్టు నుంచి తప్పించాలనడం కరెక్ట్ కాదన్నారు. ఆటగాళ్లకు ఆత్మవిశ్వాసం కల్పించడం, వారికి ఒక సందేశం ఇవ్వడం ముఖ్యమని పేర్కొన్నారు.
మేము ఆటగాళ్లకు జట్టులో సుదీర్ఘ అవకాశం ఇవ్వాలనుకుంటున్నామని స్పష్టం చేశారు. అయితే, ఇండియా తరుఫున వైభవ్ ఆట చూడటానికి మేం కూడా ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అన్నారు. అతడు మంచి ప్లేయర్ అనే దానిపై ఎలాంటి సందేహం లేదన్నారు. కాకపోతే వైభవ్ కూడా జట్టులో అవకాశం కోసం ఇతర ఆటగాళ్ల మాదిరిగానే కాస్తా వెయిట్ చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టారు.
వరల్డ్ నంబర్ వన్ టీ20 జట్టుగా పేరుగాంచిన టీమిండియాను ఐర్లాండ్ క్లీన్ స్వీప్ చేసింది. బెల్ఫాస్ట్ వేదికగా ఆదివారం (జూన్ 28) ఉత్కంఠభరితంగా జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో ఇండియా ఓడిపోయింది. తద్వారా అతిథ్య ఐర్లాండ్ టీ20 సిరీస్ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. మూడేళ్లుగా టీ20ఐ సిరీస్‌లో ఓటమి ఎరుగని భారత ఆధిపత్యానికి తెరపడింది. భారత్ చివరిసారిగా 2019లో ఆస్ట్రేలియా చేతిలో వైట్‌వాష్‌కు గురైంది.
