- బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు
- జూలై 10న పోలింగ్, అదే రోజు ఫలితాలు
యాదాద్రి, వెలుగు: చేనేత సహకార సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎనిమిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతుండటంతో జిల్లాలో ఎన్నికల సందడి నెలకొంది. చేనేత సహకార సంఘాలకు చివరిసారిగా 2013లో ఎన్నికలు జరగగా, పదవీకాలం 2018లో ముగిసింది. అప్పటి నుంచి ఎన్నికలు నిర్వహించకుండా పర్సన్ ఇన్‌చార్జీలను నియమిస్తూ వారి పదవీకాలాన్ని 17 సార్లు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్చి 24న ఉత్తర్వులు జారీ చేసి, మే 15 నాటికి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాను సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో 78 సంఘాలకు ఎన్నికలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాటన్, సిల్క్ చేనేత సహకార సంఘాలు కలిపి మొత్తం 80 సంఘాలు ఉన్నాయి. అయితే ఆలేరు, నకిరేకల్ సంఘాల సభ్యత్వ అంశం కోర్టు పరిధిలో ఉండటంతో మిగిలిన 78 సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. వీటిలో యాదాద్రి భువనగిరి జిల్లాలో 41, నల్గొండ జిల్లాలో 34, సూర్యాపేట జిల్లాలో మూడు సంఘాలు ఉన్నాయి. మొత్తం 13,708 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరగకపోయినా, చేనేత సంఘాల్లో గెలిచి రాష్ట్ర స్థాయి టెస్కో పదవులను దక్కించుకోవాలనే లక్ష్యంతో రాజకీయ పార్టీలు
వ్యూహాలు రచిస్తున్నాయి.
బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్
ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో నిర్వహిస్తారు. ప్రతి సంఘంలో తొమ్మిది మంది డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇందులో రెండు స్థానాలు మహిళలకు రిజర్వ్ కాగా, మిగిలిన ఏడు స్థానాలకు జనరల్ కేటగిరీలో ఎన్నిక జరుగుతుంది. మహిళా డైరెక్టర్ల ఎన్నికకు లైట్ పింక్ రంగు బ్యాలెట్ పేపర్‌ను, జనరల్ కేటగిరీ ఎన్నికలకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తారు.
జూలై 10న పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు
పోటీ చేసే అభ్యర్థుల్లో ఎస్సీ, ఎస్టీలకు నామినేషన్ ఫీజు రూ.500, బీసీలకు రూ.750, ఓసీలకు రూ.1,000గా నిర్ణయించారు. జూలై 2 నుంచి 4 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. జూలై 5న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. జూలై 6న ఎన్నికల గుర్తులు కేటాయిస్తారు. జూలై 10న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, అనంతరం ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలను ప్రకటిస్తారు. మూడు రోజుల తర్వాత చైర్మన్, కార్యవర్గ సభ్యుల ఎన్నిక నిర్వహించి కొత్త పాలకవర్గాన్ని ఏర్పాటు
చేస్తారు.
