కాగితాల్లోనే కరకట్టల నిర్మాణాలు..భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ముంచుకొస్తున్న వరద ముప్పు

 కాగితాల్లోనే  కరకట్టల నిర్మాణాలు..భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ముంచుకొస్తున్న వరద ముప్పు
  • కరకట్టల కోసం ప్రతిపాదనలతోనే సరిపెడుతున్న ఆఫీసర్లు
  • జిల్లాలో నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల ప్రజల్లో వరద టెన్షన్​ 
  • కోతలకు గురవుతున్న తీరప్రాంతం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో వరద భయం మళ్లీ మొదలైంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరితో పాటు ముర్రెడు వాగుకు ఇరువైపులా కరకట్టల నిర్మాణాలు ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. దీంతో జులై, ఆగస్టు నెలలు వస్తున్నాయంటే గోదావరి, ముర్రెడు పరీవాహక ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవించే పరిస్థితి నెలకొంది. మరోవైపు కట్టు, మొట్ల వాగుల వల్ల మణుగూరు పట్టణానికి ప్రతి ఏడాది వరద ముప్పు పొంచి ఉన్నా, నివారణ చర్యలు కనిపించడం లేదు. 

వరదల వణుకు...తప్పని గుండె కోత..

జులై, ఆగస్టు నెలలొచ్చాయంటే జిల్లాలోని గోదావరి నది, వాగుల పరీవాహక ప్రాంత ప్రజలకు గుండెకోత తప్పడం లేదు. గోదావరి వరదల ప్రభావం భద్రాచలం, బూర్గంపహాడ్, మణుగూరు, అశ్వాపురం, చర్ల, దుమ్ముగూడెం మండలాల ప్రజలను ఏటా వెంటాడుతోంది. బూర్గంపహాడ్ మండలం మోతెపట్టీ నుంచి ఇరవెండి, సారపాక, రెడ్డిపాలెం మీదుగా బూర్గంపహాడ్ వరకు, అక్కడి నుంచి కిన్నెరసాని పరీవాహక ప్రాంతం వరకు సుమారు 65 కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణాలు రెండు దశాబ్దాలుగా ప్రతిపాదనలు సిద్ధమైనా పనులు ముందుకు సాగడం లేదు. 

భద్రాచలం పట్టణానికి ఆవలి వైపున 51 అడుగుల ఎత్తులో 11.64 కిలోమీటర్ల పొడవున కరకట్ట నిర్మాణానికి సుమారు రూ.790 కోట్లతో నీటిపారుదల శాఖ ప్రతిపాదనలు రెడీ చేసింది. భద్రాచలం ముంపు కాలనీల ప్రజలను రక్షించేందుకు 2000లో గోదావరి తీరం వెంట 7.5 కిలోమీటర్ల మేర కరకట్ట నిర్మించారు. అయితే కూనవరం రోడ్డులో జాతీయ రహదారిపై ఓవర్‌‌‌‌‌‌‌‌బ్రిడ్జి నిర్మాణం కారణంగా సుమారు 700 మీటర్ల మేర కరకట్ట నిర్మాణం నిలిచిపోయింది. 

2002లో వచ్చిన గోదావరి వరదలతో తీర ప్రాంత కాలనీలు తీవ్రంగా ముంపునకు గురయ్యాయి. దీంతో ప్రభుత్వం రూ.38 కోట్లతో కరకట్ట పొడిగింపు పనులు చేపట్టింది. ప్రస్తుతం కరకట్ట నిర్మాణం, స్లూయిజ్, రిటైనింగ్ వాల్ తదితర పనులు చివరి దశకు చేరుకున్నాయి.

‘ముర్రెడు’ ముంపు.. ముందుకు కదలని పనులు..

లక్ష్మీదేవిపల్లి- కొత్తగూడెం సరిహద్దుల గుండా ప్రవహించే ముర్రెడు వాగు ఉధృతితో ఏటా వందలాది ఇండ్లు ముంపునకు గురవుతున్నాయి. 2022లో వచ్చిన భారీ వరదలతో పలు కాలనీలు జలమయమయ్యాయి. దీంతో ముర్రెడు వాగుకు ఇరువైపులా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో గాబియన్ వాల్ నిర్మించాలని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇందుకోసం రూ.33 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించగా, 2023లో అప్పటి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శంకుస్థాపన చేశారు. అయితే నిధులు విడుదల కాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. 2024లో ఆఫీసర్లు రూ.35 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, పూర్తిస్థాయి నివేదికతో మరోసారి రూ.55 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సమర్పించారు. అయినా నిధుల కొరత కారణంగా పనులు ముందుకు సాగడం లేదు.

మణుగూరుకు కట్టు, మొట్ల వాగుల ముప్పు..

మణుగూరు పట్టణానికి కట్టు, మొట్ల వాగుల వల్ల ప్రతి ఏడాది వరద ముప్పు తప్పడం లేదు. పట్టణానికి సమీపంలోని ఓబీ గుట్టల నుంచి వచ్చే వరద నీటితో ఈ రెండు వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుంటాయి. మరోవైపు ఆక్రమణల కారణంగా వాగులు విస్తీర్ణం తగ్గిపోవడంతో వరద పట్టణంలోకి చేరుతోంది. భారీ వర్షాలు కురిసినప్పుడు చుంచుపల్లి మండలం విద్యానగర్ కాలనీలో హైవేపై భారీగా వరద చేరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది.  

శాశ్వత పరిష్కారమే మార్గం..

గోదావరితో పాటు వాగుల వరదలతో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ఉన్నతాధికారులు స్పెషల్ ఫోకస్​ పెట్టాల్సిన అవసరం ఉంది. శాశ్వత ప్రాతిపదికన కరకట్టల నిర్మాణాలు చేపడితేనే ముంపునుంచి బయట పడొచ్చని పరీవాహక ప్రాంతాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 

పోలవరం బ్యాక్​వాటర్​ ప్రభావం..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నేపథ్యంలో బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్ ముంపు ప్రభావంతో కరకట్టల నిర్మాణాలపై ఇటీవల కొంత కదలిక కనిపించినా, అది ప్రకటనలకే పరిమితమైంది. 2022లో గోదావరికి వచ్చిన భారీ వరదలతో పరీవాహక ప్రాంతంలోని పదుల సంఖ్యలో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అప్పట్లో గోదావరిలో దాదాపు 29.20 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 

పోలవరం బ్యాక్‌‌‌‌‌‌‌‌వాటర్ ప్రభావంతో బూర్గంపహాడ్ మండలంలో సుమారు 900 ఎకరాలకు పైగా భూమి ముంపునకు గురయ్యే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భద్రాచలం ఏటా వరదలతో సతమతమవుతోంది. మరోవైపు గోదావరి తీరం ఏటా కోతకు గురవుతోంది. నీటిపారుదల, రెవెన్యూ శాఖ ఆఫీసర్లు సర్వేలు నిర్వహించి ప్రభుత్వాలకు నివేదికలు పంపడం సాధారణ ప్రక్రియగా మారింది.