- కేంద్ర నిధులపై పర్యవేక్షణ ఏదీ?
- అందుబాటులో లేని ఎంపీ.. అడుగు ముందుకు అభివృద్ధి
- నిధుల మళ్లింపుపై అడిగే నాథుడే కరువు
నల్గొండ, వెలుగు: జిల్లా అభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన దిశ మీటింగ్‌లు ఉమ్మడి జిల్లాలో అడ్రస్ లేకుండా పోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేసే పథకాల తీరుతెన్నులను సమీక్షించేందుకు ప్రతి మూడు నెలలకోసారి ఈ సమావేశం నిర్వహించాలి. కానీ, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది. రెండేళ్లుగా సమావేశాలు నిర్వహించకపోవడంతో అభివృద్ధి పనుల నాణ్యత, నిధుల వినియోగంపై పర్యవేక్షణ కరువైంది. అధికారుల ఇష్టారాజ్యంగా పాలన సాగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సూర్యాపేటలో ఒక్క మీటింగూ జరగలే
జిల్లా ఏర్పడినప్పటి నుంచి సూర్యాపేటలో దిశ సమావేశాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. చివరిసారిగా సూర్యాపేట జిల్లాలో 2024 నవంబర్ నెలలో నిర్వహించగా ఎంపీ ఎన్నికల తర్వాత రెండేళ్ల కాలంలో ఒక్కసారి కూడా దిశ మీటింగ్ నిర్వహించలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధి హామీ, జల్ జీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ వంటి కీలక పథకాలపై రివ్యూ లేకపోవడంతో గ్రౌండ్ లెవల్‌లో పనులు నత్తనడకన సాగుతున్నాయి. కలెక్టరేట్ నుంచి ప్రజాప్రతినిధుల వరకు ఎవరికీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
నల్గొండలో ఒక్కసారే
నల్గొండ జిల్లాలో రెండేళ్లలో కేవలం ఒకే ఒకసారి దిశ సమావేశం నిర్వహించారు. 2025 మే నెలలో చివరిసారిగా నిర్వహించిన సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన తీర్మానాలు కూడా ఇప్పటికీ ఆమోదానికి నోచుకోలేదు. ఎంపీ అందుబాటులో ఉన్నామని చెబుతున్నా, అధికారులతో సమన్వయం చేసుకుని మీటింగ్ ఏర్పాటు చేయడంలో విఫలమవుతున్నారనే చర్చ నడుస్తోంది. గత మీటింగ్‌లో అధికారులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయో.. పనులు ఏ దశలో ఉన్నాయో అడిగే దిక్కు లేకుండా పోయింది.మరోపక్క ఎంపీ సైతం స్థానికంగా అందుబాటులో ఉండకపోవడంతో దిశ సమావేశాలు పెట్టేందుకు అధికారులు వెనుకడుగు వేస్తున్నారన్న విమర్శలు సైతం ఉన్నాయి.
అసలు మీటింగ్ ఎప్పుడు?
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాలేదు. ఎంపీ తన నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడంతోనే దిశ సమావేశం ఊసే ఎత్తడం లేదన్న విమర్శలు ఉన్నాయి. జిల్లా యంత్రాంగం కూడా ఇందుకు సహకరించడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, ఎంపీ స్పందించి వెంటనే దిశ సమావేశం నిర్వహించాలని, పెండింగ్‌లో ఉన్న తీర్మానాలను ఆమోదించి అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా ప్రజలు
డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర పథకాలు గాలికి..
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వందల కోట్ల నిధులకు సంబంధించి దిశ కమిటీదే కీలక పాత్ర. పీఎం గ్రామ్ సడక్ యోజన, నేషనల్ హెల్త్ మిషన్, మధ్యాహ్న భోజన పథకం, రేషన్ బియ్యం పంపిణీ వంటి 40కి పైగా పథకాలను ఈ కమిటీ పర్యవేక్షించాలి. కానీ మీటింగ్‌లే లేకపోవడంతో నిధుల మళ్లింపు జరుగుతోందని, అసలైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై కనీస పట్టు లేని అధికారులు, పట్టించుకోని ప్రజాప్రతినిధుల వల్ల జిల్లా వెనకబడుతోంది.
