వెలుగు ఓపెన్ పేజీ : సంక్షోభం అంచున సింగరేణి!

 వెలుగు ఓపెన్ పేజీ : సంక్షోభం అంచున సింగరేణి!

తెలంగాణ  సిరుల గని  సింగరేణి కేవలం బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు.  లక్షలాది  కుటుంబాలకు బతుకుదెరువుగా,  విద్యుత్ ఉత్పత్తికి,  పారిశ్రామికాభివృద్ధికి చోదకశక్తిగా నిలిచిన నల్ల బంగారు గని. అయితే, ఎంతో  ప్రాశస్త్యం కలిగిన సింగరేణి  కాంగ్రెస్ పాలనలో అవినీతి,  అక్రమాలకు నిలయంగా మారడం ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ పాలనలో ఉత్పత్తికి, కార్మిక సంక్షేమానికి పట్టుగొమ్మగా నిలిచిన సింగరేణి లాభాల బాటలో పయనించింది. దేశానికే ఆదర్శంగా నిలిచింది.  కానీ,  నేడు కాంగ్రెస్  కుంభకోణాల ఊబిలో  చిక్కుకొని  కొట్టుమిట్టాడుతున్నది. కన్నతల్లే  వివక్ష చూపినట్లు 51శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం యధేచ్ఛగా  దోపిడీ కొనసాగిస్తుంటే, 49శాతం వాటా ఉన్న కేంద్రం జరుగుతున్న అక్రమాలను అడ్డుకోకపోగా, దృతరాష్ట్రుని వలె కళ్లు మూసుకొని వ్యవహరిస్తోంది.  కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఒకరికొకరు తోడై సింగరేణి మనుగడనే  ప్రశ్నార్థకం చేస్తున్నాయి. 


కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టులు అస్మదీయులకు  కట్టబెట్టడం కోసం  నిబంధనలను అడ్డగోలుగా మార్చారు.  సింగరేణి  చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన ప్రవేశ పెట్టారు.  ఓబీ  కాంట్రాక్టును ఆశించే  కంపెనీ సైట్ విజిట్ చేయాలి.  చేసినట్లు సింగరేణి నుంచి సర్టిఫికెట్ పొందాలి.  అప్పుడే  టెండర్  వేయడానికి అర్హత వస్తుంది. ఈ  సర్టిఫికెట్ జారీని అడ్డుపెట్టుకొని పోటీని పరిమితం చేశారు. ఎవరికి  సర్టిఫికెట్ ఇవ్వాలి,  ఎవరికి ఇవ్వొద్దు అనేది అంతా పాలకుల ఇష్టమే.  ఈ అవకాశాన్ని అడ్డంపెట్టుకొని  ముఖ్యమంత్రి  ఏకంగా తన బామ్మర్దికి చెందిన శోధా  కన్​స్ట్రక్షన్స్ కంపెనీకి కాంట్రాక్టులు  కట్టబెట్టిండు. వెంకటేశ్  ఖనిలో  ప్లస్ 13  శాతానికి  టెండర్  దక్కేలా  చేసిండు.  2024 మే  తర్వాత  వచ్చిన  ఓబీ  టెండర్ల  కాంట్రాక్టులన్నీ  వారి నిర్ణయాల మేరకే  జరిగి, వారి అనుయాయులకే దక్కాయి.  శ్రీరాంపూర్  ఓసీ-2  విషయంలో  వాటాల పంపకాలపై ఏకాభిప్రాయం  కుదరకపోవడంతో  టెండర్‌‌ను ఏడుసార్లు వాయిదా వేశారు. ఈ అవినీతి,  అక్రమాలను బీఆర్ఎస్  నిలదీయడంతో,  ప్లస్ 12 శాతంగా ఉన్న టెండర్‌‌ను  మైనస్ 12 శాతానికి ఖరారు చేశారు. బీఆర్ఎస్  పుణ్యమా అని  సింగరేణి  సొమ్ము అవినీతిపాలు కాకుండా కొంత ఆదా అయింది.  ఈ  కుంభకోణాలను ఒక్కొక్కటిగా  బీఆర్ఎస్  బయటపెట్టడంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన కాంగ్రెస్ తప్పించుకోవడం కోసం కంటి తుడుపుగా ఒక్క  నైనీ  బ్లాక్ టెండర్‌‌ను రద్దు చేసింది. 

సోలార్ పవర్‌‌‌‌లోనూ స్కాం

సోలార్  పవర్  ప్లాంట్ల  టెండర్లలోనూ ఇదే  ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’  నిబంధనను ఉపయోగించి  సింగరేణి  నిధులను స్వాహా  చేశారు. 107 మెగావాట్లు,  67  మెగావాట్ల  సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు విషయంలో పక్షపాతంగా వ్యవహరించి  ముందే  నిర్ణయించిన  కంపెనీలకు  టెండర్లు  కట్టబెట్టారు.  నిబంధనలు సాకుగా చూపించి చిన్న,  మధ్య తరహా  సంస్థలు  టెండర్లలో  పాల్గొనకుండా చేశారు.  ఒక  మెగావాట్‌‌కు  ధర రూ.3  కోట్లుగా ఉంటే,  తమ అవినీతి  ప్రయోజనాల కోసం రూ.7 కోట్లకు పెంచి  కేటాయించడంతో  67 మెగావాట్ల  ప్రాజెక్టులోనే  సుమారు  రూ.250 కోట్ల  అదనపు  భారం  సింగరేణిపై పడింది.   అదేవిధంగా 107 మెగావాట్ల  ప్లాంట్‌‌ను  మెగావాట్‌‌కు  రూ.5.4 కోట్ల  చొప్పున మొత్తం రూ.540 కోట్లకు కట్టబెట్టారు.  రూ. 480 కోట్లతో  నిర్మించిన 67 మెగావాట్ల  ప్లాంట్  రెండేళ్లు గడిచినా ఇప్పటికీ సింక్రనైజేషన్, పీపీఏ లేకుండా నిరుపయోగంగా ఉంది.  అలాగే  580 కోట్లతో  చేపట్టిన 107 మెగావాట్ల ప్లాంట్ కూడా పీపీఏ లేక, సింక్రనైజేషన్ పూర్తికాక మూలనపడింది. సోలార్ పవర్  కొనుగోలు చేయబోమని విద్యుత్ సంస్థలు ఇప్పటికే సర్క్యులర్  ఇచ్చినా కమీషన్ల కోసమే ఈ వ్యవహారం నడిపారు. సుమారు రూ.1000 కోట్ల సింగరేణి  సొమ్మును వృథా చేశారు.

పీపీఏ, డీపీఆర్ లేకుండా ప్రాజెక్టులు

మంచిర్యాల జిల్లా  జైపూర్‌‌లో 800 మెగావాట్ల  థర్మల్  పవర్ ప్లాంట్‌‌కు  టెండర్లు పిలిచి,  ముందే  నిర్ణయించిన  కంపెనీలకు వేలకోట్ల రూపాయలకు కాంట్రాక్టులు కట్టబెట్టారు. రాజస్తాన్‌‌తో  కలిసి  జాయింట్ వెంచర్‌‌గా  చేపట్టాలనే ప్రతిపాదనకు  తెలంగాణ  ప్రభుత్వం  ఆమోదం  తెలపలేదు.  ఈ ప్రాజెక్టుకు  పీపీఏ,  డీపీఆర్  లేకపోవడంతో  అప్పులు పుట్టక  ప్రాజెక్టు మూలనపడింది. ఇప్పటికే  సుమారు  రూ.1,000  కోట్లు  ఖర్చు  చేశారు.  ప్రాజెక్ట్ ఆలస్యం కారణంగా  సింగరేణికి  రోజుకు  రెండు కోట్ల  చొప్పున  ఏడాదికి రూ. 750 కోట్లు నష్టం.  ఎంత విచిత్రం అంటే..  రాజస్థాన్  ప్రభుత్వంతో 76:24 నిష్పత్తిలో ఒప్పందం చేసుకోగా,  తమ 24 శాతం వాటా కింద పాకిస్థాన్ సరిహద్దులోని   జైసల్మేర్ వద్ద  సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు భూమి కేటాయించారు. అతి తక్కువ ధరకే ఎన్‌‌టీపీసీ నుంచి విద్యుత్ అందుబాటులో ఉండగా  సోలార్  పవర్ ఎందుకు?   బొగ్గు ఉత్పత్తి చేసే  సింగరేణి సంస్థ  ఎక్కడో  జైసల్మేర్‌‌లో  సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?  రాజస్థాన్‌‌లోని  జైపూర్‌‌లో  కార్పొరేట్ కార్యాలయం ఏర్పాటుచేసి సిబ్బందిని  నియమించడం ఎందుకు?  ఇది  సింగరేణి నిధుల వృథా కాదా?  ఈ తతంగం అంతా కమీషన్లు  దండుకోవడం  కోసం కాదా?

బొగ్గునే మాయం చేసిన ఘనులు

బొగ్గు నిల్వల విషయంలో  ప్రభుత్వం చేస్తున్న  గోల్‌‌మాల్ చూస్తే  నవ్విపోదురుగాక  నాకేంటి సిగ్గు అన్నట్లుంది.  సింగరేణిలో  40 లక్షల  మెట్రిక్ టన్నుల  బొగ్గు నిల్వలు ఎలా మాయం అయ్యాయని బీఆర్ఎస్  నిలదీస్తే అది కప్పిపుచ్చుకునేందుకు  తంటాలు  పడుతున్నారు.  అధికారిక  వెబ్‌‌సైట్‌‌లో 26 లక్షల  మెట్రిక్ టన్నులకు కుదించారు.  రోజుకు 40వేల  మెట్రిక్ టన్నుల చొప్పున స్టాక్ తగ్గిస్తూ  గోల్‌‌మాల్  చేశారు.  సుమారు  రూ.1600  కోట్ల  బొగ్గు ఎక్కడా  అంటే  సమాధానం లేదు.  బొగ్గు నిల్వలు చూడడానికి వెళ్లిన బీఆర్ఎస్  నాయకులను వందల మంది  పోలీసులను  పెట్టి అడ్డుకున్నారు. లేని నిల్వలు  చూపేందుకు  రామగుండం, భూపాలపల్లి సహా  ఇతర గనుల్లో  సమీప ఏరియాల  నుంచి బొగ్గును  లారీలల్లో  తెచ్చి పోస్తున్నరు. ఎంతదారుణం అంటే అడ్రియాలా లాంగ్‌‌వాల్ గనిలో  ఏడాదిన్నరగా ఉత్పత్తి నిలిచిపోతే అక్కడా లక్షా 80వేల టన్నులు బొగ్గు ఉన్నట్లు రికార్డుల్లో చూపుతున్నారు. ఇంత దారుణంగా  వంచించడం  వెనుక ఉన్న అసలు వాస్తవం ఏమిటి?

కుంభకోణాల మయం

ఎక్స్​ప్లోజివ్స్​  కొనుగోళ్లలో  మార్కెట్  ధరల కంటే  అధిక ధరలకు కొనుగోళ్లు చేసి  ఒక్క  ఆర్డర్‌‌లోనే  సుమారు  రూ.300  కోట్ల నష్టం కలిగించారు. అభ్యంతరం చెప్పిన అధికారులపై  ఒత్తిడి తీసుకువచ్చి బదిలీలు, రాజీనామాలు  చేయించారు.  డీజిల్  కొనుగోళ్ల విధానాన్ని  మార్చి  ప్రైవేటు  కాంట్రాక్టర్లకు  లాభం  చేకూర్చారు.  దీనివల్ల  ప్రతి  ఏడాది  వందల కోట్ల అదనపు భారం పడుతోంది.  సింగరేణి  లాభాలను  తప్పుగా  చూపించి వేల కోట్ల నిధులు  పక్కదారి పట్టించారు.  కార్మికులకు ఇచ్చే లాభాల  బోనస్‌‌లోనూ  కోత  విధించారు.  బొగ్గు కొనుగోళ్ల బాకీ చెల్లించకుండా  రెండున్నరేండ్లలో  కాంగ్రెస్  ప్రభుత్వం సంస్థకు 12,377 కోట్లు బకాయి పడింది.   రాష్ట్ర  ప్రభుత్వ ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ) పరిమితి రూ. 3200 కోట్లు ఉంటే,  సింగరేణి  ఏకంగా రూ. 4300 కోట్ల  ఓవర్ డ్రాఫ్ట్​కు  వెళ్ళింది.  చివరకు  కార్మికులకు  జీతాలు ఇవ్వాలంటే బ్యాంకుల వద్ద అప్పులు తీసుకోవాల్సిన  దుస్థితికి  సంస్థను నెట్టారు.  సింగరేణి  భవిష్యత్తు  ప్రణాళిక అంటూ లాభాల్లో చూపకుండా  గతేడాది రూ.2283 కోట్లు,  ఈ  ఏడాది రూ. 4034 కోట్లు పక్కన బెట్టారు.  మరి సింగరేణి  రూ.6317 కోట్ల  లాభాల్లో ఉంటే  రూ.4300 కోట్ల  ఓడీ ఎందుకు?  బ్యాంకు నుంచి  అప్పులు ఎందుకు? తలా తోక లేని  నిర్ణయాలు,  అవినీతి  కుంభకోణాల వల్ల  సింగరేణిలో ఉత్పత్తి తగ్గిపోయింది.  బీఆర్ఎస్ ప్రభుత్వం  దిగిపోయే నాటికి 2023లో  70 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగగా, 2025–26 నాటికి 
58 మిలియన్  టన్నులకు  పడిపోయింది.

బోగస్‌‌గా ఎన్నికల మేనిఫెస్టో

కేసీఆర్ కారుణ్య నియామకాలను పునరుద్ధరించారు.   వారం వారం  మెడికల్ బోర్డులు నిర్వహించారు.  16,813 వేల  కారుణ్య  నియామకాలు పూర్తిచేసి, యువ కార్మికులతో సింగరేణిని  కళకళలాడేలా  చేశారు.  గత  ఎన్నికల  మేనిఫెస్టోలో  కారుణ్య  నియామకాలకు పెద్ద ఎత్తున  హామీలు ఇచ్చిన  కాంగ్రెస్  అధికారంలోకి  రాగానే ఆ విషయాన్ని  పూర్తిగా  విస్మరించింది.  డిపెండెంట్ ఉద్యోగాల  నియామక ప్రక్రియను  నిరవధికంగా  నిలిపివేసింది.  కార్మిక సోదరుల  ఆశలపై  కుండెడు నీళ్లు చల్లింది.  కేసీఆర్  సింగరేణిని  లాభాల బాటలో  నడిపించడమే కాకుండా,  ఆ లాభాల్లో  కార్మికులకు  గతం కంటే  ఎక్కువ వాటా దక్కేలా చేశారు.   కాంగ్రెస్  అధికారంలోకి రాగానే  సంస్థ  సంక్షోభం పాలైంది.  సంస్థ సొమ్ము అవినీతిపరుల పాలైంది.  
సంక్షోభంలోపడి  తండ్లాడుతున్నది. 

సింగరేణి కోసం మరో పోరాటం

 సీఎం బంధువుల అవినీతి బాగోతాలపై  నిష్పాక్షిక  విచారణ  జరిపించి,  దోచుకున్న  సొమ్మును  రికవరీ చేయాలి.  49 శాతం వాటా ఉన్న  కేంద్రం  ప్రేక్షక పాత్రకు పరిమితం కాకుండా,  సింగరేణి  సంస్థ  పరిరక్షణ కోసం  జోక్యం  చేసుకోవాలి.  ముఖ్యమంత్రి  అండదండలతో జరుగుతున్న  అక్రమాలపై  కేంద్ర పరిశోధన  సంస్థల ద్వారా  దర్యాప్తు  జరిపించాలి.   దోపిడీ సొమ్ము  కక్కించాలి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  తోడు దొంగలుగా  వ్యవహరిస్తే  బీఆర్ఎస్   బొగ్గు గుట్టల్లో  మరో  ఉద్యమ  అగ్గి  పుట్టిస్తుంది.  ‘కాంగ్రెస్ హటావో – సింగరేణి బచావో’ నినాదంతో   కార్మికులతో  భుజం కలిసి  కాంగ్రెస్  అవినీతికి  చరమగీతం  పాడుతుంది.  సిరుల గనిగా  సింగరేణికి ఉన్న ప్రతిష్టను తిరిగి నిలబెడుతుంది.

- తన్నీరు హరీశ్ రావు, 
మాజీ మంత్రి

 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.