హైదరాబాద్ సిటీ, వెలుగు: దేశీయంగా కంటైనర్ల ద్వారా సరుకు రవాణాను మరింత పెంచేందుకు భారతీయ రైల్వేలు 'ప్రత్యేక కంటైనర్ రైల్ టెర్మినల్' అనే సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. ఈ క్రమంలోనే సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడానికి, రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్‌కు చెందిన 'వెల్దుర్తి గూడ్స్ షెడ్'ను ప్రత్యేక కంటైనర్ రవాణా కేంద్రంగా రైల్వే శాఖ ప్రకటించింది.
దీనివల్ల వ్యాపారులకు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా సరుకులను పంపించుకునే అవకాశం లభిస్తుంది. హైదరాబాద్ డివిజన్‌లో ఈ రకమైన ప్రత్యేక గుర్తింపు సాధించిన మొదటి గూడ్స్ షెడ్ ఇదే కావడం విశేషం. ఇది దేశీయ రవాణా రంగంలో ఒక కీలక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఈ ప్రాంత ఆర్థిక ఎదుగుదలకు ఎంతో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.
ఈ నూతన కేంద్రం నుంచి మొదటి సరుకు రవాణా రైలు (కంటైనర్ రేక్) విజయవంతంగా పంజాబ్ రాష్ట్రంలోని ఫిల్లౌర్ ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోకు బయలుదేరింది. ఈ విజయంతో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని పరిశ్రమలను అనుసంధానించే రైల్వే నెట్‌వర్క్ మరింత బలోపేతమైంది. ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ అధికారులను, సిబ్బందిని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రత్యేకంగా అభినందించారు.
