హత్యాయత్నం కేసులో అరెస్టులు ఎక్కడ..? పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

హత్యాయత్నం కేసులో అరెస్టులు ఎక్కడ..? పోలీసులను ప్రశ్నించిన హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: హత్యాయత్నం లాంటి కేసులో నిందితులను అరెస్టు చేయకుండా కేవలం నోటీసులు ఇవ్వడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో కూడా ఇదే విధానం పాటిస్తున్నారా..? దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా..? అని పోలీసులను ప్రశ్నించింది. భారతకుమారి అనే మహిళ తనతో పాటు తన కుమార్తెను చంపేందుకు కుట్ర జరిగిందని, దీనికి ఆధారాలు ఉన్నా నిందితులను అరెస్టు చేయలేదని హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జస్టిస్ టి. మాధవీదేవి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్ కోడలు దీక్ష, సంధ్య బన్నూరి కలిసి ఆహారంలో జోల్పిడెమ్ అనే మందు కలిపి తల్లి, కూతురిని చంపేందుకు ప్రయత్నించారని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నా ఇప్పటివరకు అరెస్టు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

దీనిపై ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేశ్​రాజే స్పందిస్తూ.. నిందితుల్లో ఒకరు తొమ్మిది నెలల గర్భిణి కావడంతో అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చామని తెలిపారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. హత్యాయత్నం కేసులో కూడా కేవలం నోటీసులతో సరిపెడతారా..? అన్ని కేసుల్లో ఇదే పద్ధతి పాటిస్తున్నారా..? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది.