ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పుతో ఒక విడాకుల కేసులో భర్త తన భార్యకు చెల్లించాల్సిన మధ్యంతర మెయింటెనెన్స్‌ను తగ్గించింది. అశుతోష్ రాయ్ అస్తానా–యమితా రాయ్ అస్తానా దంపతుల మధ్య కొనసాగుతున్న డైవర్స్ కేసులో ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన నెలకు రూ.30 వేల మెయింటెనెన్స్‌ను హైకోర్టు తిరిగి రూ.25 వేలకు తగ్గించింది. ఈ మొత్తం 2021 ఏప్రిల్ 12 నుంచి వర్తిస్తుందని స్పష్టం చేసింది.
1995 నవంబర్ 2న వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2021లో భార్య మెయింటెనెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా.. మొదట నెలకు రూ.25 వేలు మంజూరయ్యాయి. అయితే 2024లో ఫ్యామిలీ కోర్టు దాన్ని రూ.30 వేలకు పెంచింది. దీనిని భర్త హైకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ సౌరభ్ బెనర్జీ విచారణ చేపట్టారు. అయితే కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వక ముందు భర్త రూ.20వేలు న్యాయంగా ఆమె ఖర్చుల కోసం చెల్లించాడు. దీనిని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది.
ఈ కేసులో భర్తపై ఉన్న ఆర్థిక బాధ్యతలను కోర్టు ప్రత్యేకంగా పరిగణించింది. ఇద్దరు పిల్లలూ ప్రస్తుతం తండ్రి వద్దే ఉంటున్నారు. కాబట్టి వారి చదువుల ఖర్చు, ఇతర ఖర్చులను భర్తే భరిస్తున్నారు. ముఖ్యంగా పెద్ద కుమార్తె ఎక్కువ ఖర్చుతో కూడిన MBBS కోర్సు చదువుతుండటంతో ఆర్థిక భారం మరింత పెరిగింది. దీనికి తోడు భర్తకు లోన్స్, ఇతర ఆర్థిక బాధ్యతలు కూడా ఉన్నాయని కోర్టు గుర్తించింది.
అదే సమయంలో భార్యకు ఉన్న ఆర్థిక వనరులనూ హైకోర్టు పరిగణించింది. ఆమె MBA ఫైనాన్స్ చదివారు. భర్తకు చెందిన 3 బెడ్‌రూముల ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారు. అలాగే నెలకు రూ.10వేల 450 అద్దె ఆదాయం, సుమారు రూ.4వేల 400 FD వడ్డీ ద్వారా పొందుతున్నారు. సో ఆమెకు వస్తున్న ఆదాయం, ఉంటున్న హౌసింగ్ ఫెసిలిటీని ఫ్యామిలీ కోర్టు తగినంతగా పరిగణించలేదని హైకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు ‘రాజ్‌నేష్ వర్సెస్ నేహా’ తీర్పులో సూచించిన సూత్రాలను అనుసరించిన హైకోర్టు.. మెయింటెనెన్స్ నిర్ణయంలో ఇరుపక్షాల ఆదాయం, అవసరాలు, బాధ్యతలు, ఆస్తులు, జీవన ప్రమాణాలను సమగ్రంగా చూడాలని స్పష్టం చేసింది. భర్తకు అధిక ఆదాయం ఉన్నప్పటికీ.. పిల్లల బాధ్యతలతో పాటు భార్యకు ఉన్న ఆదాయ వనరులను కూడా పరిగణించాల్సిందేనని పేర్కొంది. దీంతో నెలకు రూ.30 వేల మెయింటెనెన్స్‌ను రూ.25 వేలకు తగ్గిస్తూ తీర్పు వెలువరించింది.
