- పర్మిషన్ లేకుండా, జీఎస్టీ కట్టకుండా అక్రమ రవాణా
- ఆఫీసర్లకు మేనేజ్ చేస్తూ తెలంగాణలోకి ప్రవేశిస్తున్న లారీలు
- ఏపీలో రెండు వర్గాల మధ్య గొడవ.. బయటపడ్డ దందా
- ఇటీవల 15 లారీలు పట్టుకున్న ఆఫీసర్లు
నల్గొండ, వెలుగు : ఏపీ, తెలంగాణ సరిహద్దుల్లో గ్రానైట్ మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా, జీఎస్టీ చెల్లించకుండా ఏపీ నుంచి గ్రానైట్ ను తెలంగాణకు తీసుకొస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఏపీలో రెండు వర్గాల మధ్య మొదలైన విభేదాలతో ఈ అక్రమ దందా బట్టబయలైంది. తెలంగాణలోకి అక్రమంగా తరలిస్తున్న గ్రానైట్ లారీలను ఇటీవల కోదాడ బార్డర్ వద్ద సేల్స్ టాక్స్ ఆఫీసర్లు పట్టుకున్నారు.
తెలంగాణ మీదుగా మహారాష్ట్రకు...
గ్రానైట్ లారీలు ఏపీ నుంచి తెలంగాణలోకి యథేచ్ఛగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఏపీలోని ప్రకాశం, బాపట్ల ప్రాంతాల నుంచి ప్రతి రోజూ పదుల సంఖ్యలో వస్తున్న లారీలు ఎలాంటి వే బిల్లులు, పన్ను రశీదులు లేకుండానే తెలంగాణలోకి ప్రవేశించి మహారాష్ట్ర వైపు వెళ్తున్నాయి. ఏపీ నుంచి వచ్చే లారీలు దాచేపల్లి, మఠంపల్లి, వాడపల్లి, హుజూర్‌నగర్ మీదుగా కోదాడకు చేరుకుంటున్నాయి. అక్కడి నుంచి కొన్ని లారీలు సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల మీదుగా మహారాష్ట్రకు వెళ్తుండగా... మరికొన్ని లారీలు ఖమ్మం వైపు తరలిపోతున్నాయి. మరో వైపు ఖమ్మం, నల్లొండ, కరీంనగర్ జిల్లాల్లోని వ్యాపారులతో చేతులు కలిపి తక్కువ ధరకు గ్రానైట్ సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత ఆఫీసర్లకు నెలవారీ మామూళ్లు ఇస్తూ.. ఎలాంటి పన్నులు కట్టకుండా 'జీరో' దందాకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఒక్క లారికి చెల్లించి..
ఏపీ నుంచి వచ్చే గ్రానైట్ లారీలు తెలంగాణలోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా వే బిల్లులు చూపించాలి. రోజుకు సగటున 40 నుంచి 50కి పైగా లారీల గ్రానైట్ తెలంగాణలోకి వస్తుండగా... ఒక్కో లారీలో సుమారు ఐదు వేల క్యూబిక్ మీటర్ల గ్రానైట్ ను తరలిస్తుంటారు. రూల్స్ ప్రకారం ఒక క్యూబిక్ మీటర్ కు మైనింగ్ డిపార్ట్ మెంట్ కు రూ. 12తో పాటు మొత్తం గ్రానైట్ విలువలో 18 శాతం సేల్స్ టాక్స్ చెల్లించాలి.
ఈ లెక్కన ఒక్కో లారీ నుంచి ప్రభుత్వానికి సుమారు రూ.లక్ష వరకు ఆదాయం రావాలి. కానీ తెలంగాణలోకి వచ్చే గ్రానైట్ లో సగానికి కూడా పన్ను చెల్లించడం లేదు. ఒక్క లారీకి ట్యాక్స్ చెల్లించి అదే నంబర్ పై మిగతా లారీలను అక్రమంగా తరలిస్తూ... ఒక్కో లారీపై వేల రూపాయల పన్నును ఎగ్గొడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు.
గ్రూపుల గొడవతో గుట్టు రట్టు
చాలా కాలంగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ దందా.. ఏపీలోని రెండు గ్రానైట్ వ్యాపార వర్గాల మధ్య జరిగిన గొడవతో వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, సమాచారాన్ని లీక్ చేయడంతో జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ అధికారులు రంగంలోకి దిగారు. అయితే ఏపీ, తెలంగాణ బార్డర్ లో లారీలను గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ముగ్గురు ఆఫీసర్లకు నెలనెలా భారీ మొత్తంలో ముడుపులు అందుతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో బార్డర్ వద్ద నిఘా పెంచిన జీఎస్టీ అధికారులు.. నిబంధనలకు విరుద్ధంగా తరలుతున్న 15 గ్రానైట్ లారీలను ఇటీవల పట్టుకున్నారు. కోదాడ బార్డర్ వద్ద పది లారీలను పట్టుకోగా, దాచేపల్లి సరిహద్దుల్లో మరో ఐదు లారీలను పట్టుకున్నారు. గతేడాది సైతం సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న పది లారీలను పట్టుకున్నారు.
